మూసాపేట, డిసెంబర్ 5: భూమి సారవంతంగా ఉంటేనే తెగుళ్లు తగ్గి నాణ్యమైన పంటతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని ఏవో రాజేందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని జానంపేట రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకొని భూసారంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవోతోపాటు, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, జిల్లా డైరెక్టర్ మల్లయ్య మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసులు, అచ్చాయిపల్లి చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకుడు శివరాములు, ఆయా గ్రామాల రైతులు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల, డిసెంబర్ 2: మృత్తిక(భూమి) ప్రాణకోటికి ఆధారమని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ అప్పియచిన్నమ్మ అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్రం, ఏకోక్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవుడు ప్రకృతిహితమైన జీవనశైలి కలిగి ఉండాలని, కాటన్ దుస్తువులను ధరించాలని, మృత్తికను సంరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఒక టేబుల్ స్పూన్ మృత్తికలో ప్రపంచంలోని మానవ జనాభా కంటే అధికమైన జీవులు ఉంటాయన్నారు. ఈ జీవులు మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయన్నారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు సదాశివయ్య మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్రంలోనే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలలో కూడా నేలతల్లి ఆవశ్యకతను వివరించినట్లు పేర్కొన్నారు. నేలను సంరక్షించడంతోనే ప్రకృతి సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, వకృత్త పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.
బాలానగర్, డిసెంబర్ 5: మండలంలో ఉడిత్యాల రైతువేదికలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఏవో ప్రశాంత్‌రెడ్డి రైతులకు భూమిలో ఉండే పోషకాలు, భూసారా పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ నర్సింగ్‌రావు, సర్పంచ్ మల్లేశ్‌యాదవ్, రైతులు తదితరులు ఉన్నారు.
కోయిలకొండ, డిసెంబర్ 5: పంటసాగులో రైతులు సేంద్రియ ఎరువులనే వినియోగించాలని సర్పంచ్ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని శ్రీరామకొండ రైతువేదికలో నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రోజురోజుకీ రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలో సారం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పాతపద్ధతిలో సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు భూమి సారవంతంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు రాము, రాములు, కోఆప్షన్ సభ్యుడు ఖాజ, రైతుబంధు సమితి కన్వీనర్ కుర్మయ్య, ఏవో రామ్‌పాల్, నాయకులు ఆశన్నగౌడ్, సంజు తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట , డిసెంబర్5: రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని ఎంపీపీ సంతోష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కాకర్లపహాడ్ రైతువేదికలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఏరాపటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ శాఖ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏవో కృష్ణకిశోర్, రైతుబంధు కోఆర్డినేటర్ సంజీవరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఆంజనేయులు, ఏఈవో గౌతమి, రైతులు తదితరులు ఉన్నారు.
హన్వాడ, డిసెంబర్ 5: రైతులు పంటలు వేసే ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల సూచనల ప్రకారం పంటలు సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు.కార్యక్రమంలో ఏవో కిరణ్‌కుమార్, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఏఈవోలు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.