అయిజ, ఏప్రిల్ 21 : ఆరుగాలం కష్టపడి పండించిన కల్లెదుటే తడిసిపోతుండడంతో రైతుల గుండెల్లో గుబులు రేగింది. పండించిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించినా సకాలంలో తూకం వేయకపోవడం, గన్నీ బ్యాగుల కొరత, తరలింపునకు లారీలు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం తడవకుండా సర్కారు టార్ఫాలిన్లు అందించాల్సి ఉన్నప్పటికీ అవేవి రైతులకు అందించక పోవడంతో రైతులే టార్ఫాలిన్లు సమకూర్చుకొని రక్షణ కల్పించికుంటున్నారు. కొందరు రైతులు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కల్లాల్లోనే నిల్వ చేసుకోవడంతో అకాల వర్షానికి తడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతదశలో ఉన్న వరి, మొక్క జొన్న పంటలు నేలకొరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మంగళవారం సాయంత్రం అయిజ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యం రైతులు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లతో ధాన్యాన్ని భద్ర పర్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. కొందరు రైతులు గన్నీ బ్యాగుల్లో నింపి టార్ఫాలిన్లతో రక్షిస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి, మొలకలు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.