బిజినేపల్లి : మండలంలోని సాయిన్పల్లి గ్రామ శివారు సమీపంలోని గంగారం బీట్ పరిధిలో ఉన్న టేకుల కుంట వద్ద అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక ( Deer ) మృత్యువాత పడింది . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుంట సమీపంలో నిర్మించిన చెక్డాం వద్ద జింక తల( Head) మాత్రమే ఉండగా మొండెం ( Torso) కనిపించడం లేదు. జింక కుక్కల దాడిలో మృత్యువాత పడిందా, మరి ఇంకేమైనా జరిగి ఉంటుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెల రోజుల క్రితం మండల పరిధిలోని వట్టెం గ్రామంలోకి జింక రావడంతో గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు ( Forest Officials ) సమాచారం ఇచ్చి జింకను అప్పజెప్పారు. వారం రోజుల క్రితం కీమ్యాతండా సమీపంలో మరో జింక కుక్కల దాడిలో మృతిచెందగా ఆ జింక మృతదేహాన్ని ఖననం చేయకుండా అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలోని బార్డర్ కాలువలో నిర్లక్ష్యంగా పడేశారు.
మరో జింకపై కుక్కలు వెంటపడి దాడి చేస్తుండగా గమనించిన స్థానికులు కుక్కల దాడి నుంచి జింకను రక్షించారు. గంగారం అటవీ శాఖ పరిధిలో అడవి జంతువులపై జరుగుతున్న ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. జంతువులకు రక్షణ కల్పించి మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.