దేవరకద్ర, డిసెంబర్ 27 : మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం తెల్లవారు జామున కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు పంచామృతాభిషేకం నిర్వహించి స్వామివారికి మహాఅలంకరణ చేశారు.
అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తుల మధ్య హనుమాన్ నామస్మరణతో రథోత్సవం కార్యక్రమం చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.