ఊట్కూర్, మే 24 : నారాయణపేట జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు సిబ్బంది కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మూడేండ్లుగా ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై ప్రజలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న చోట సహాయకులే కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
మరో వైపు 60ఏండ్ల్లు నిండిన వారు ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీలు పెరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల పనిభారం పెరగడంతో సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుంటున్నారు. జిల్లాలోని నారాయణపేట, మద్దూర్, మక్తల్ మొత్తం 3 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 704 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే వీటిలో అనేక కేంద్రాలు టీచర్లు, సహాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కారణంగా కేంద్రాలు నిర్వీర్యమవుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చాలా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున టీచర్లు, సహాయకుల పోస్టులను భర్తీ చేసింది. పలు దఫాలుగా సిబ్బంది జీతాలు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోవడంతో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ మహిళల్లో ఆందోళన నెలకొన్నది.

సేవలపై తీవ్ర ప్రభావం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత వల్ల కేంద్రాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల కేంద్రాలు సమయానికి తెరుచుకోవటం లేదని, పౌష్టికాహారం పంపిణీలో కూడా అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. మరో పక్క అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టు లు ఏళ్లు గడుస్తున్నా భర్తీ చేపట్టకపోవడంతో తమపై అదనపు భారం పడుతోందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
నిరుద్యోగుల్లో అసంతృప్తి..
అర్హతలు కలిగిన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టకపోవడంపై నిరుద్యోగ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల భర్తీకి ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు సందర్భాల్లో వేదికల ద్వారా గుర్తు చేశారు. కానీ నేటి వరకు అతీగతీ లేకపోవడంతో మహిళా అభ్యర్థులు ప్రభుత్వ హామీలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను వెంటనే భర్తీ చేసి అంగన్వాడీ సేవలను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు సంక్షేమ సేవలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం..
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, స హాయకుల పోస్టుల వివరాలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తు న్నాం. జిల్లాలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న కేంద్రా ల పరిస్థితిపై సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నప్పటికి సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అవసరమైన చోట అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుం చి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఖాళీల భర్తీ ప్రక్రి య చేపడుతాం.
– రాజేందర్‌గౌడ్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రోగ్రాం అధికారి
