రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని పశు వైద్యశాలలకు తరలించడం కష్టతరం. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 2016లో ప్రత్యేకంగా 1962 పేరుతో సంచార పశువైద్యశాల వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పశువైద్యుడు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు.
గ్రామాల్లో జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తే.. ఫోన్ చేసిన వెంటనే అక్కడికి చేరుకొని ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు. సోమవారం వనపర్తి మండలంలోని ఖాశీంనగర్ తండాకు చెందిన రైతు స్వామినాయక్ ఫోన్ చేసిన పది నిమిషాల్లోపే వైద్యులు సంచార వాహనంలో వచ్చి చికిత్స చేశారు. ఇలాంటి పథకం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది.