మరికల్, మే 19 : సేవే పరమావధిగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. వేసవిలో బాటసారుల దప్పికను తీర్చాలనే ఉద్దేశంతో మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి స్మారకార్థం ఆయన కుటుంబ సభ్యులు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తీలేరు మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి.. తన తండ్రి జ్ఞాపకార్థం 45 ఏండ్ల కిందట తీలేరు స్టేజీ వద్ద రాగి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెంకట్‌రెడ్డి మరణానంతరం కే.వీరారెడ్డి కేంద్రాన్ని కొనసాగించారు. కాగా, రెండేండ్ల కిందట వీరారెడ్డి మృతి చెందాడు. వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్‌కుమార్ రెడ్డి.. తాత, తండ్రి ఆశయానికి కొనసాగింపుగా రాగి అంబలి కేంద్రాన్ని ఏటా వేసవి కాలంలో ఏర్పాటు చేస్తున్నాడు. పొలాలకు వెళ్లే రైతులు, రోడ్ల వెంట వెళ్లే ప్రజలు అంబలి తాగి సేద తీర్చుకుంటున్నారు. నిత్యం కలితో చేసిన అంబలిని రాములమ్మ తయారు చేస్తున్నది. సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని ప్రశాంత్‌కుమార్ రెడ్డి, తీలేరు సర్పంచ్ రేవతమ్మ అంటున్నారు. అలాగే మండలకేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 22 ఏండ్లుగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయ్యప్ప భక్తుల సహకారంతో అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నట్లు గురుస్వామి సతీశ్ తెలిపారు.
నాటి నుంచి నేటి వరకు..
45 ఏండ్ల కిందట అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. ‘వేసవిలో అంబలి తయారుచేసి పంపిణీ చేయడం నీ బాధ్యత’ అని వెంకట్‌రెడ్డి చెప్పారు. నాటి నుంచి నేటి వరకు కలితో అంబలిని తయారు చేస్తున్నాను. ఉదయమే నిద్ర లేచి అంబలి కాస్తున్నా. ఎండాకాలం వచ్చిందంటే అంబలికి జనం గుమికూడుతారు. అంబలి రాములమ్మ అంటే అందరికీ తెలుసు. నిత్యం వందల మంది వచ్చి దప్పిక తీర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
– రాములమ్మ, తీలేరు
నాన్న నేర్పిన బాధ్యత..
ఎండాకాలంలో పది మందికి అంబలి అందించి దాహం తీర్చడం చాలా సంతృప్తినిస్తున్నది. నాన్న నేర్పిన బాధ్యతతో ఏ టా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తున్నాను. వచ్చే ఏడాది అంబలితోపాటు మజ్జిగ కేం ద్రం కూడా ఏర్పాటు చేయాలని ఉన్నది. ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం దాగి ఉన్నది. అంబలి కోసం ప్రత్యేకంగా రాగులు కొనుగోలు చేస్తా.
– ప్రశాంత్‌కుమార్ రెడ్డి, తీలేరు
అయ్యప్ప కృపతో..
అయ్యప్ప భక్తుల సహకారం, స్వామి కృపతో 22 ఏండ్లుగా బాటసారులకు రాగి అంబలి అందిస్తున్నాం. దేవుడి దయతో అంబలి పంపిణీ చేస్తున్నాం. సేవ చేయడంలో ఉన్న తృప్తి మరేదాంట్లో లేదు. నిత్యం బాటసారులకు అంబలి పోసి దూప తీరుస్తున్నాం.
– కస్పె సతీశ్ కుమార్, మరికల్