Amarachinta | అమరచింత, మే 20 : అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. స్థానిక ఎన్నికలు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకనూన్ పల్లె భగవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ ఖాన్.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సంజీవ్ ముదిరాజ్, మహిళా సంఘం నాయకురాలు నాగలక్ష్మీతో పాటు జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ముందే ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం అమరచింత మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరచింత పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా, టీపీసీసీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజ్ గౌడ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు హాజరయ్యారు. కాగా జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మండల, పట్టణ, గ్రామస్థాయిలో పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టేందుకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు రావడంతో మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న వారితో పాటు ఆసక్తి కలిగిన వారు మండల, పట్టణ, గ్రామస్థాయి అధ్యక్షులుగా పని చేయదలసిన వారు మూడు రోజుల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ ఖాన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం కొత్తవారు పాతవారు అంటూ కార్యకర్తల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మండలంలోని కొంకనంపల్లి గ్రామ అధ్యక్షుడు భగవంతు రెడ్డి మాట్లాడుతూ.. తాను 1990 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలల తర్వాత ఇప్పుడు కార్యకర్తల సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. రైతు భరోసా ఇప్పటికి చాలామంది రైతులకు పడలేదని, రూ. 500కే సిలిండర్ అని హామీ ఇచ్చిన కేవలం 42 రూపాయలు మాత్రమే మహిళల అకౌంట్లో పడుతున్నాయని తెలిపారు. ఇక కొత్తగా సన్నబియానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని, చాలావరకు రైతులకు బోనస్ డబ్బులు రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా బహిరంగంగా విమర్శిస్తున్నారని.. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లడం కష్టమని భగవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మీడియా సోదరులను పిలవలేదని దయచేసి విలేకరులు బయటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు దయచేసి నాయకుల అభిప్రాయాలను ఫోటోలు, వీడియోలు తీయొద్దని వారించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అమరచింత పట్టణ అధ్యక్షుడు ఎస్ఎం అరుణ్ కుమార్, మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు పోసిరి గారి విష్ణు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు మంగయ్య నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రకాశం, మాజీ ఎంపీటీసీలు మహంకాళి విష్ణు, ఉసిరి గారి తిరుమలేష్, పలువురు మాజీ సర్పంచులు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.