అచ్చంపేట, జూన్ 12: అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఏ ఫైల్ కదలాలన్న డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి ప్రజలను నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన రైతు జంతుక మశన్నకు సంబంధించిన ప్రభుత్వ అసైన్డ్‌భూమిని ఆయనకు తెలియకుండా అక్రమంగా ఇతరులపై పట్టా మార్పిడి చేసిన వ్యవహరం ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో వెలుగులోకి రావడంతో రెవెన్యూశాఖలో కలకలం రేగింది. బతికే ఉన్న వ్యక్తిని మరణించినట్లు చూపిస్తూ పత్రాలుసృష్టించి భూమిని బదిలీ చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన బయటపడడంతో అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై నెపం నెట్టివేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూభారతి ఆపరేటర్ ఒక్కడిపై చర్యలు తీసుకొని అసలు వ్యవహారాన్ని మరుగునపర్చాలని చూస్తున్నారు. ఆపరేటర్‌పై నెపం నెట్టివేసి అతడిని కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేయడమా? లేక ఆపరేటర్‌ను బాధ్యులు చేస్తూ క్రిమినల్ కేసు పెట్టి అధికారులెవరికి సంబంధం లేన్నట్లు చేయాలనే ప్రయత్నాల్లో అధికారుల మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.
ఈ భూమి వ్యవహారంలో రూ.9లక్షలు చేతులు మారినట్లు రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక అధికారికి రూ.6లక్షలు, మరో అధికారికి రూ. 3లక్షలు చేరినట్లు చర్చ జరుగుతుంది. ఇటీవల అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయంలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ అధికారి ఈ వ్యవహరంలో కీలకపాత్ర పోషించినట్లు రెవెన్యూవర్గాలు పేర్కొంటున్నాయి. నమస్తే తెలంగాణలో ఈ వ్యవహరంపై కథనం ప్రచురితమైన వెంటనే బదిలీపై వెళ్లిన సంబంధిత అధికారి శుక్రవారం ఉదయం అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయానికి వచ్చి ప్రస్తుత తాసీల్దార్ సైదులుతో చర్చించి వెళ్లినట్లు సమాచారం. ఈ కేసు తమపై రాకుండా కిందిస్థాయి సిబ్బందిపై నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి పట్టా మార్పిడి పూర్తిచేసిన అనంతరం సంబంధిత పత్రాలను చించివేసినట్లు సమాచారం. ఇదే తరహాలో మరికొన్ని భూముల విషయంలో కూడా అక్రమాలు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ అసైన్డ్భూములను ఇతరుల పేరుపై నేరుగా పట్టా మార్చే అధికారం ఎవరికీ లేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. పట్టాదారు జీవించి ఉన్నంతకాలం ఆ భూమిపై హక్కులు ఆయనకే ఉంటాయని, మరణించిన పక్షంలో మాత్రమే వారసులకు విరాసత్ ద్వారా హక్కులు బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరుపై పట్టా మార్పిడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు అధికారులు ప్రతిఫైల్కు రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కార్యాలయ పనివేళలు ముగిసిన అనంతరం కొందరు అధికారులు సమావేశమై ఇలాంటి అక్రమ పట్టా మార్పిడులు, రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహరం తాసీల్దార్ కనుసన్నల్లోనే జరుగుతోందని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హాజీపూర్‌లో రైతుకు తెలియకుండానే పట్టా మార్పిడి చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం. పట్టాదారు బతికి ఉన్నప్పటికీ విరాసత్ చేయడం తప్పు. బాధ్యులు ఎవరైనా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ద్వారా నాకు విషయం తెలిసింది. కలెక్టర్ కార్యాలయం నుంచి విచారణకు ఆదేశిస్తారు. బాధ్యులు తేలితే చట్టపరంగా బాధ్యత వహించాలి.