KCR Birth Day | అయిజ, ఫిబ్రవరి 17: జాతి ప్రజలను జాగృతం చేసి దశాబ్దాల కలను సాకారం చేసిన జాతిపిత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పదేండ్లు రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు ఆశాదీపంగా నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో కారణజన్ముడిగా చరిత్రలో నిలిచాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం అయిజ పట్టణం బాలుర ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వృక్షార్చన, బీఆర్ఎస్ యువజన నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే విజయుడు శిబిరం ప్రారంచారు. అటుపై వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా పదేండ్లపాటు పరిపాలన కొనసాగించారన్నారు. నదీ జలాలను బీళ్లకు మళ్లించి రైతన్నను రాజు చేసిందే కేసీఆర్ అన్నారు. పదేండ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అంతకుముందు రక్తదాన శిబిరంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేక్ కోసి ఎమ్మెల్సీకి, బీఆర్ఎస్ నాయకులకు తినిపించారు.
తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, అందుకే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పదేండ్లు పరిపాలన కొనసాగించాడని, నేడు ప్రతి తెలంగాణ పౌరుడు కేసీఆరే కావాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వందేళ్లు ఆయుస్సు పోసుకుని తెలంగాణను కాపాడేలా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటానని తెలిపారు.