అలంపూర్, ఏప్రిల్ 23 : గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, ముందస్తు చర్యలు చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇంట్రా, వాటర్‌గ్రిడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా వారు నదుల్లో ఉన్న నీటి నిల్వలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రానీయొద్దని ఆదేశించారు. సాధారణ రోజుల్లో నీటి సమస్య ఎదుర్కునే గ్రామాలపై దృష్టి పెట్టి మరి ముఖ్యంగా వేసవిలో ఆ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
రానురాను నదుల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నదుల్లో నీరు డెడ్ స్టోరేజికి చేరుకున్న సందర్భాల్లో ఎక్కువ కలుషితం అయ్యే అవకాశం ఉందని, ప్రత్యేక దృష్టి పెట్టి నీటిని శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దని ఎలాంటి అవరోధాలు ఎదురైనా పరిష్కరించే ప్రయత్నం చేయండని, మీ పరిధిలో కాకపోతే మా దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ వెంకటరమణ, శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, డీఈఈలు, ఏఈలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.