ఉండవెల్లి, ఆగస్టు 9 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని డీ-బూడిద్దపాడు శివారులో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో వననర్సరీలు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్, ట్యాంకర్లను మంంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రతిఒక్కరూ మొక్క లు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో తిరుపతన్న, బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి, గోపాల్, రాఘురెడ్డి, రుక్కూ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇటిక్యాల, ఆగస్టు 9 : ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 79మంది లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే విజయుడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. కాగా, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా లబ్ధిదారులకు చెక్కులను అందించేందుకు పోటీపడగా గందరగోళం నెలకొన్నది. దీంతో ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో వచ్చి అందరినీ బయటకు పంపించారు. అనంతరం 32మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రంగారెడ్డి, తాసీల్దార్లు నరేందర్, ధరణీషా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.