కౌకుంట్ల, జులై 6: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కౌకుంట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన ప్రత్యేక స మావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యా రు. ముందుగా ఆయన మండల పరిధిలోని రాజోళి, పుట్టపల్లి, ఇస్రంపల్లి, కౌకుంట్ల గ్రామాల బూత్‌ల వారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లడుతూ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి బూతు స్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా కార్యచరణ చేపట్టాలన్నారు. ఎస్ఐర్పై కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి సహకరించాలన్నా రు. గ్రామాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించడంలో విఫలమైన విధానాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.