AITUC | అచ్చంపేట రూరల్ : ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ భవనంలో మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమావేశము ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శివ శంకర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ డ్రాప్ అవుట్స్ తగ్గించాలని ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2001లో ప్రారంభించిన ఈ స్కీము విజయవంతం కావడానికి కార్మికుల పాత్ర కీలకంగా మారింది. కానీ పిల్లల కడుపులు నింపుతున్న కార్మికులకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని విమర్శించారు.
నిత్యవసర వస్తువుల ధరలు, గుడ్ల ధరలు పెరుగుతున్న వాటికి అనుగుణంగా బిల్లులు మాత్రం ప్రభుత్వాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కోడిగుడ్డు ధర ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలే కార్మికులు ఎలా గుడ్లు కొనుగోలు చేసి పెడతారు అని ప్రశ్నించారు. నెలకు 2000 రూపాయలు మాత్రమే ప్రతినెల ఇవ్వాల్సి ఉన్న అది మూడు నెలలకు నాలుగు నెలలకు ఇస్తున్నారు కార్మికులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. బిల్లులు రాక అప్పులు చేసి వడ్డీలు కడుతున్నారని అన్నారు కొంతమంది కార్మికులు బంగారం కుదరవబెట్టి పిల్లల కడుపులు నింపుతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగా పదివేల రూపాయలు ఇవ్వాలి.. గుర్తింపు కార్డులు ఇవ్వాలి.. పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న అచ్చంపేట ఆర్డిఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎన్ తిరుపతమ్మ, సిపిఐ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ సమితి కార్యదర్శి పెర్ముల గోపాల్, వంట కార్మికులు జ్యోతి, భారతమ్మ, మంగమ్మ, మణెమ్మ, నరసమ్మ, నూతన సాయిలమ్మ, తదితరులు పాల్గొన్నారు.