వానకాలం సాగుకు వేళైంది.. ఈ తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొన్ని కంపెనీల అసత్యపు ప్రచారాలతో మోసపో వద్దన్నారు. నాసిరకం ఉత్పత్తులపై అప్రమత్తంగా ఉంటూ.. గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలే కొనుగోలు చేయాలని, నకిలీవి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
– అయిజ రూరల్, మే 14
అయిజ రూరల్, మే 14 : వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో మార్కెట్లో గుర్తింపులేని నకిలీ విత్తనాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న తరుణంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది పత్తి విస్తీర్ణం విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలనే వాడాలని చెబుతున్నారు. నకిలీలను అరికట్టేందుకు విత్తన ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొందుపర్చిన వివరాలను సరిచూసుకొని కొనుగోలు చేయాలని అంటున్నారు. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలను కొనుగోలు చేయాలి. విత్తన కొనుగోళ్లలో ఏవైనా అవకతవకలకు పాల్పడితే సదరు డీలర్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విక్రయించే సమయంలో రశీదులో కొనుగోలు, తయారు, గడువు తేదీతోపాటు ఒరిజినల్ రశీదుపై డీలర్ సంతకం ఉండేలా చూసుకోవాలి. గడువు చెల్లిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కొనుగోలు చేయొద్దు.
గతేడాది ప్రభుత్వ గుర్తింపు లేని కంపెనీల వద్ద రైతులు విత్తనాలు కొనుగోలు చేయగా.. పంట రాక కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసిన సంఘటనలు జరిగాయి. మరికొన్ని గ్రామాల్లో పత్తిపంటలో కాయలు కాయక, పూతలు ఎండిపోయి అధిక పెట్టుబడులు పెట్టి అప్పులపాలయ్యారు. శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ అధికారులు కలిసి వందల ఎకరాల్లో పంటలను పరిశీలించారు. రైతులు పూత పట్టని పత్తి పంటను పెకిలించి ఎన్నో ఇబ్బందులుపడ్డారు. ఇవన్నీ గుర్తుంచుకొని రైతులు మరోసారి ఆలోచించి విత్తనాలను కొనుగోలు చేసి.. అధిక దిగుబడి పొంది ఆర్థికంగా స్థిరపడాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనం నాటాక.. మొలకెత్తక, పూత సరిగ్గారాక, పంటలో లోపం కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పంటకు చీడపీడలు, తెగుళ్లు సోకినప్పుడు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి. పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే అధికమేలు జరుగుతుంది.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
వానకాలం సమీపిస్తుండడంతో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అంటగడితే కఠినచర్యలు తీసుకుంటాం. అటువంటి వారి లైసెన్స్లు సైతం రద్దు చేసి షాపులను సీజ్ చేస్తాం. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలి. విత్తనప్యాకెట్లు, పురుగుమందుల డబ్బాలపై తయారు, గడువుతేదీ తప్పనిసరిగా ఉండాలి. కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందులను రైతులకు విక్రయించొద్దు.
– శంకర్లాల్, ఏవో
నాణ్యమైన విత్తనాలనే అమ్ముతున్నాం
ఎన్నో ఏండ్లుగా వ్యాపారం చేస్తున్నాం. అప్పటినుంచి కూడా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులనే రైతులకు విక్రయిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులనే అమ్ముతున్నాం.
– వెంకటేశ్, పంచముఖి పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, అయిజ