మహబూబ్నగర్ కలెక్టరేట్, జూన్ 6 : విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లాలో ప్రతి ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు అధికారిక గుర్తింపు తీసుకోకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారి తల్లిదండ్రులపై ఆర్థికంగా భారం మోపుతున్నారు. ఆకర్షణీయమైన బ్యానర్స్, పోస్టర్లు వేసి పెద్దఎత్తున అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు గుర్తింపు లేదని ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నో ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వం గుర్తింపు లేకుండా వెలిసినా.. బయటపడ్డవి కొన్ని మాత్రమే.. అధికారులు తమ చేతివాటం ప్రదర్శించడం తో వెలుగులోకి రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నే గుర్తింపు లేని పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొందరు యజమానులు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అనుమతి తీసుకొని అనధికారికంగా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొని, అధికారులు నుంచి అనుమతి రాకముందే పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. మామూళ్ల మత్తులో జోగుతున్న విద్యాశాఖ అధికారుల అండదండలతో ప్రైవేట్ యాజమాన్యాల తీరు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది.
ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యాశాఖ అధికారులు 8 నుంచి 10వ తరగతి వరకు, ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఉన్న ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయాలి. అందులో గుర్తింపు లేని విద్యాసంస్థలపై డీఈవోకు నివేదికను అందజేయాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో అనుమతి లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయో? ఏ అధికారి స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది జూన్లో అనుమతి లేని పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో స్పందిస్తుంటారన్న విమర్శలు ఉన్నాయి.
గుర్తింపు లేని పాఠశాలల్లో చదివితే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుమతి ఉన్న స్కూళ్లల్లో చదివితేనే తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సులభంగా చేరవచ్చు. అదే గుర్తింపు లేకపోతే అడ్మిషన్ కష్టమవుతోంది. కొన్నిసార్లు గుర్తింపు లేకపోతే నిఖార్సైన అధికారులు మధ్యలో ఆ పాఠశాలను మూసేస్తే అక్కడ చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉన్నది.
గుర్తింపులేని పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడానికి వీలులేదు. అందుకని గుర్తింపు ఉన్న పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకొని, ఆ పాఠశాలల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. దీనికోసం అధికంగా ఫీజులు వసూలు చేస్తారు. తల్లిదండ్రులు కూడా చేసేదేమీలేక రాజీపడుతున్నారు. అడ్మిషన్ సమయంలో గుర్తింపులేని విషయాన్ని చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. చివరిలో అడిగితే తాము గుర్తింపు కోసం దరఖాస్తు చేశామని, అధికారులు అనుమతివ్వలేదని పాఠశాలల యజమానులు వారిపై నెపం మోపుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సముదాయం, క్రీడా ప్రాంగణం, ఫిట్నెస్ ఉన్న బస్సులు, ఫైర్ సేఫ్టీ అను మతి పొంది ఉండాలి. కానీ నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రైవేట్ పాఠశాలు, వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని బాహాటంగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదనుగా యాజమాన్యాలు పాఠశాల భవన నిర్మాణం నుంచి మొదలుకొని ఫీజుల వసూళ్ల వరకు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా బోధన అందించాలి. కానీ అలాంటివి జిల్లాలో చాలా వరకు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నూతన పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
మహబూబ్నగర్ పట్టణం బాలాజీనగర్ ప్రధాన ముఖద్వారం సమీపంలో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఓ పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ ఆ పాఠశాల ప్రచార ఫ్లెక్సీల్లో, ప్రచారంలో మాత్రం తమ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు 2020లో ఉన్నట్లు పేర్కొంటూ ప్రచారం చేస్తూ అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నాయి. అలాగే శేషాద్రినగర్లో కొత్తగా నిర్మిస్తున్న ఓ పాఠశాల భవన నిర్మాణం చేపట్టి.. పనులు పూర్తికాకపోయినా.. బడి ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తిచేసి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి.
విచిత్రం ఏమిటంటే భవనం ఇంకా పూర్తికాక ముందే మహబూబ్నగర్ నగర పాలక సంస్థ ఆ పాఠశాలకు శానిటేషన్ సర్టిఫికెట్, సౌండ్ పొల్యూషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం కొసమెరుపు. అయితే ఈ పాఠశాల ఫిజికల్ ప్రపోజల్స్ నాట్ సబ్మిటెడ్ అనే కారణంతో ఈ పాఠశాల అనుమతులకు సంబంధించిన దస్త్రం డీఈవో కార్యాలయ అధికారులు తిరస్కరించారు. బాలాజీనగర్లో నూతనంగా బహుళ అంతస్థులో ఏర్పాటు చేసిన పాఠశాలకు సంబంధించి అనుమతులు మంజూరు కాలేదని.. దరఖాస్తుకు సంబంధించిన ఫైల్ పరిశీలనలో ఉన్నదని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అధికారులు చెబుతుండగా..
మహబూబ్నగర్ ఎంఈవో మాత్రం ఆ పాఠశాలకు గతంలోనే అనుమతి ఉండొచ్చు.. లేకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా వేసి ప్రచారం చేస్తారని చెప్పడం అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, పనితీరుకు అద్దం పడుతోంది. ఆ పాఠశాల భవనంలో మూడేండ్ల కిందట వేరే పాఠశాలను కొనసాగించి, ప్రస్తుతం పాలకొండ బైపాస్ రహదారి సమీపంలోకి మార్చారనేది జగమెరిగిన సత్యం.