గండీడ్ మే 21 : ప్రభుత్వం చేపట్టిన సర్వే కార్యక్రమానికి రైతులందరూ సంపూర్ణంగా సహకరించాలని అదనపు కలెక్టర్ మోహన్ రావు అన్నారు. భూ భారతి సర్వే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామం ఎంపిక అయ్యింది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వే కార్యక్రమం సందర్భంగా గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సహకారం ఉంటేనే సర్వే ముందుకు సాగుతుందని అన్నారు. రైతులు వారు ఖాస్తు చేస్తున్న భూమిని సర్వేకు వచ్చిన అధికారులకు పక్కాగా చూపించాలి.
చాలా గ్రామాల్లో కొంతమంది రైతులు వ్యవసాయం చేయని వారి భూమి హద్దులు చెరిపేసి కబ్జాలో తీసుకున్నారు. గతంలో వారి ఆధీనంలో ఉన్న భూమి మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. కబ్జాలో ఉన్న భూమిని రైతులు చూపించాలని అప్పుడే బౌండరీలు గుర్తించడం సులువు అవుతుందని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా గ్రామ పటం సిద్ధం చేశామని త్వరలో అన్ని సర్వే నెంబర్ల ప్రకారం కొలతలు నిర్వహించి హద్దులు పాతుతామన్నారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు, ఇంచార్జ్ తహసిల్దార్ మాధవి, ఆర్.వి సర్వే ఏజెన్సీ ప్రతినిధి విక్రమ్ రెడ్డి, ఆర్ ఐ యాసిన్, రికార్డ్ అసిస్టెంట్ రుక్మిణి పాల్గొన్నారు.