జోగులాంబ గద్వాల : జిల్లాలోని గురుకులాలు( Gurukul) , సంక్షేమ శాఖల వసతి గృహాల ( Hostels ) నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉండవల్లి జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ ( Suspend ) మరో ఇద్దరికి మెమో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించామని, ప్రతి నెలా కనీసం రెండు సార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్యా, భద్రతా, మౌలిక వసతులైన త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలను సమీక్షించాలని సూచించారు.
తహసీల్దారులు, ఎంపీడీవోలు తమ పరిధిలోని వసతి గృహాలలో తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు వెంటనే స్పందించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆహార కమిటీ పర్యవేక్షణలో ప్రతి రోజు భోజన నాణ్యతను పరిశీలించి, ఇద్దరు విద్యార్థుల సంతకాలతో రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. వసతి గృహాలలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి సంఘటన జరిగినా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం, ఇతర వ్యక్తుల ప్రమేయం వల్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని అన్నారు . పాఠశాలలు, వసతి గృహాలలో అనధికార వ్యక్తులు, ముఖ్యంగా మహిళల హాస్టల్లో ప్రవేశించకుండా కఠిన నిబంధనలు పాటించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు,ఆర్డీవో అలివేలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు , స్పెషల్ ఆఫీసర్స్, విద్యా శాఖ అధికారులు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.