ఊట్కూర్ : నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ, లీగల్ సర్వీసెస్ సంస్థ ( Legal Services) ఆధ్వర్యంలో శుక్రవారం ఊట్కూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లె తండాలో న్యాయ విజ్ఞాన సదస్సు ( Legal Awareness Camp ) నిర్వహించారు. సదస్సులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే సురేష్, డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతి గౌడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి మాట్లాడారు.
రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు (Equal Rights) కల్పించిందన్నారు. రాజ్యాంగ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలు హక్కులను నిర్భయంగా పొందగలుగుతారని తెలిపారు. సమాజంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ సమానత్వంతో జీవించేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందన్నారు.
పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు, పోక్సో చట్టాలు, సామాజిక భద్రత వంటి చట్టాల గురించి వివరించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్యారా పేదలు ఉచిత న్యాయాన్ని పొందగలుగుతారని సూచించారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలను వివరిస్తే సంస్థ ద్వారా పరిష్కార మార్గం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు అరుణ, జ్యోతి, ఏఎస్సై సాయిబాబా, పార లీగల్ వాలంటీర్లు ఉమ, వర్ష, అంజమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.