గద్వాల, మే 23 : జిల్లాలో ని ప్రాజెక్టులను పరిశీలించి భద్రతపై నివేదికను తయా రు చేయడానికి ఐదుమందితో కూడిన నిపుణుల బృందం 10రోజులపాటు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టును పరిశీలన చేసిన బృందం శనివారం ర్యాలంపాడ్ రిజర్వాయర్‌ను పరిశీలించింది. ప్రాజెక్టుల సేఫ్టీపై పరిశీలన చేయడానికి సీడీఎస్ ఈ నిపుణులు (సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్)అశోక్‌కుమార్, (రిటైర్డ్ ఈఎన్సీ) ల క్ష్మణ్ కుమార్, (రిటైర్డ్ ఎస్ ఈ) భవానీరాంశంకర్, (రిటైర్డ్ మెకానిక్ నిపుణులు) సంజీవ్ బృందం జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతోపాటు నెట్టెంపాడ్, ర్యాలంపాడ్, నాగర్‌దొడ్డి, తాటికుంట, గుడ్డెందొడ్డి, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించనున్నారు.
ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఈ బృందం ప్రాజెక్టుల సేఫ్టీ పరిశీలన చేసి భద్రతా ప్రమాణాలు, సిల్ప్‌వే సామర్థ్యం వంటి వాటిని పరిశీలన చేయనున్నారు. ఆనకట్ట యొక్క నిర్మాణ సమగ్రత, ప్రస్తుత ఆనకట్టల పరిస్థితి, డ్యాం సేఫ్టీ తదితర వాటిని నిపుణుల బృందం అంచనా వేస్తున్నారు. 2021 డ్యాం భద్రత చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వాహణ, మరమ్మతులు, సాంకేతిక లోపాలు తలెత్తితే ఇంజినీర్లు తీసుకున్న చర్యలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
గతంలో జూరాల గేట్లకు ఉన్న ఇనుప గొలుసులు తెగిపోయిన సమయంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం 20 గేట్ల మరమ్మతులు పూర్తికావడంపై ఇరిగేషన్ అధికారుల నుంచి నివేదిక తీసుకున్నారు. ర్యాలంపాడ్ రిజార్వాయర్ లీకేజీలు పరిశీలించి.. తీసుకుంటున్న చర్యలపై సమాచారం తీసుకొని నివేదిక తయారు చేస్తున్నారు. గతంలో సీడబ్ల్యూసీ నుంచి వచ్చిన పుణె బృందం ఇచ్చిన ప్రాథమిక నివేదికతోపాటు పూర్తిస్థాయిలో లీకేజీలు అరికట్టడానికి అక్కడ నిర్వహిస్తున్న మట్టి శాంపిల్స్‌ను పరిశీలించింది. వీటితోపాటు గుడ్డెందొడ్డి, నాగర్‌దొడ్డి, తాటికుంట, ముచ్చోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించి పూర్తి నివేదికను సర్కారుకు, జాతీయ డ్యాంసేఫ్టీ అథారిటీకి నివేదికలు ఇవ్వడానికి బృందం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.