Marikal | మరికల్, జులై 16 : మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుండి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మరికల్ ఎస్సై రాము కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌గర్ నుండి మరికల్ వైపు వస్తున్న లారీ పెద్ద చింతకుంట సమీపంలో పంక్చర్ కావడంతో దాన్ని అక్కడే నిలిపివేశాడు డ్రైవర్. ఈ క్రమంలో లారీ టైర్ విప్పుతుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ బోయ బాలకృష్ణ(34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కంటైనర్ బాలానగర్ నుంచి రాయిచూర్ వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతుడు బోయ బాలకృష్ణ మహబూబ్‌గర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేన గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాము తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌గర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఉంది.