జడ్చర్లటౌన్, జూన్ 20 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు జిల్లా ప్రజలకు వరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నాయకులే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని, దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు.
అప్పట్లో ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకున్న వాళ్లే మళ్లీ ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయలేదని చెప్పుకొస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కార్పొరేషన్ నిధులతో పాలమూరు ప్రాజెక్టు పనులు చేశామన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌కు మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనుల కోసం రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 5వేల కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లకాలంలో కేవలం రూ. 500 కోట్లు ఖర్చు చేసి గొప్పలు చెప్పుకుంటుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్వాసితులకు ఎకరాకు రూ. 11లక్షల నుంచి రూ. 16 లక్షల ముఫ్పై వేలకు ప్యాకేజీ పెంచామని గుర్తు చేశారు. దీని గురించి తాము ప్రచారం చేసుకోలేదన్నారు. ఎన్నికల్లో రూ. 25లక్షలు ప్యాకేజీ పెంచుతామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఒక్క రూ పాయి కూడా పెంచలేదని విమర్శించారు. సింగిల్ ప్యాకేజీకి మాత్రమే పెంచి మిగతా వాళ్లకు పెంచలేదని, సింగిల్ ప్యాకేజీ కింద చాలా తక్కువ మంది ఉన్నారన్నారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మూడు వేల కుటుంబాలకు 300 ఎకరాలు భూసేకరణ చేసి ఒక్కొ కుటుంబానికి 300 గజాలు చొప్పున ఇండ్ల స్థలాలను కేటాయించామన్నారు. అంతేకాకుండా వల్లూరు, ఉదండాపూర్ గ్రామాల పేర్లమీదనే శంకుస్థాపన చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మొట్టమొదటగా ఉదండాపూర్ భూ నిర్వాసితులకు అందించామన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ విషయంలో గత రెండున్నరేండ్లలో ఎప్పుడూ రాజకీయం చేయలేదని.. నిర్వాసితులు బాగుపడటమే తమ ధ్యేయమని చెప్పారు. భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉన్నదని, భవిష్యత్‌లోనూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం
రాష్ట్రంలో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. అసమర్థ కాంగ్రెస్ పాలనతో రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డుల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. ధాన్యం కొనటం చేతగాక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై సాకు చూయించి కొనుగొలు కేంద్రాలను మూసివేసేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా లు చేస్తూ రైతులను నట్టేట మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని, వాటి విషయాలను మాట్లాడకుండా కాంగ్రెస్ నేతలు రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నామని సంబురాలు చేయ టం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికలప్పుడు రైతుభరోసా కింద రూ. 15వేలు ఇస్తామన్న కాంగ్రెసోళ్ల్లు ఇ ప్పుడు రూ. 12వేలకు కుదించి రైతుభరోసా వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవటంతో రైతులకు రైతుబీమా అందకుండా పోయిందన్నారు.
ప్రతి పంటకు బోనస్ చెల్లిస్తామన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు దిగుబడి తక్కువ వచ్చే వాటిపైనే బోనస్ ఇస్తామంటూ చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు ఖాతాల్లోనే నేరుగా రైతుబంధు డబ్బులు వచ్చిపడ్డాయన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు వారం, పదిరోజుల్లోనే బాధిత రైతు కుటుంబానికి రైతుబీమా అందేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతుల కోసమే గ్రామాలు, క్లస్టర్లలో రాష్ట్రవ్యాప్తంగా 8వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరను అందించి పంట కొనుగోలు చేశామన్నారు. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రైతులకు స్వర్ణయుగంలా కొనసాగిందని, ఇప్పుడు రాక్షసపాలన కొనసాగుతుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీమాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.