Achampet | అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 15 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో దారుణం జరిగింది. హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటలకు చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నండిపల్లి గ్రామానికి చెందిన దూరం వీరయ్య(50)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవలే వీరయ్య కుమారుడు ఆమెను తీసుకొని ఏపీలోని గురజాలకు వెళ్లాడు. మహిళ కుటుంబ సభ్యులు వారిని గుర్తించి.. గురజాల నుంచి నడింపల్లికి తీసుకొచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు మహిళ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో తమ కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు నచ్చజెప్పి ఇరు కుటుంబాలను పంపించేశారు.
మళ్లీ వీరయ్య కుమారుడు.. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పసిగట్టిన మహిళ కుటుంబ సభ్యులు.. వీరయ్య, ఆయన పెద్ద కుమారుడిని టార్గెట్ చేశారు. ఎందుకంటే కేసు పెట్టినందుకు. దీంతో ఇవాళ ఉదయం అచ్చంపేట నుంచి నడింపల్లికి వస్తుండగా.. కారుతో ఢీకొట్టి వీరయ్యను కత్తులతో నరికి చంపారు. వీరయ్య పెద్ద కుమారుడు స్పాట్ నుంచి తప్పించుకున్నాడు.
ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వీరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే వీరయ్య హత్యకు ఓ కానిస్టేబుల్ అని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వీరయ్య రెండో కుమారుడికి ఆమెను పరిచయం చేసి, వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆ కానిస్టేబుల్ ప్రోత్సహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహాంతో ఉన్న వీరయ్య కుటుంబ సభ్యులు.. ఘటనాస్థలానికి రాగానే ఆ కానిస్టేబుల్‌ను తరిమికొట్టారు. అతను ఆర్టీసీ బస్సులో ఎక్కి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.