వనపర్తి, జూన్ 15 (నమస్తే తెలంగాణ : సన్నరకం సాగు చేస్తే మద్దతు ధరతో పాటు రూ.500ల బోనస్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎగనామం పెట్టింది. సీఎం, మంత్రులు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పారని రైతులు మండిపడుతున్నారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరినా డబ్బులు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయాల వెంటనే రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పడమే కానీ.. అమలు కావడం లేదు. రైతులు వీటి కోసం నెలల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో 2లక్షల 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను యాసంగిలో ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మాల ద్వారా కొనుగోలు చేశారు. రెండు నెలల నుంచి కొనుగోలు ప్రక్రియ జరుగుతుండగా, ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయనున్నారు.
సన్న వడ్లకు క్విం టాకు రూ.500 బోనస్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని అందించడంలో మాట నిలబెట్టుకోవడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 17 వేల మంది రైతులు సన్నరకం వడ్లను ప్రభుత్వానికి విక్రయించారు. ఈ రైతుల నుంచి దాదాపు 97వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేశారు. అ యితే.. వీరిలో ఒక్క రైతుకు కూడా బోనస్ డబ్బులు రాలేదు. దాదాపు రూ.47 కోట్ల బోనస్‌ను ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. వానకాలం సీజన్లో ఆలస్యంగా బోనస్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యాసంగి సీజన్లో ఒక్క రైతుకు బోనస్ ఇవ్వకపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మే నెలలో ధాన్యం అమ్ముకున్న రైతులు ఎప్పుడు బోనస్ పడుతుందంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
యాసంగిలో వరి ధాన్యం అమ్ముకున్న రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాన్ని.. నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో పడ్డంత ఇబ్బంది గతంలో ఎ ప్పుడూ చూడలేదని స్వయంగా రైతులే చెబుతున్నా రు. తూకం వేసిన అనంతరం లారీలు లేవని వారం రోజులు బ్రేక్, మిల్లులకు తరలించినా తర్వాత ధా న్యం సరిగా లేదని మరో 10 రోజులు నిలుపుదల, చివరకు అన్ని అయినా డబ్బులు ఇవ్వడంలో నరకం చూపెడుతున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. బోనస్‌తోపాటు ధాన్యం అమ్మిన డబ్బులను కూడా పెండింగ్ పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి తక్ పట్టీలు రాకపోవడం.. మిల్లర్లు సహకరించకపోవడంతో రైతులకు వెంటనే అందాల్సిన డబ్బులు కూడా చేరడం లేదు. కాగా, బోనస్ సంగతి అటుంచితే.. జిల్లాలో రూ.80 కోట్లు రైతులకు అందాల్సి ఉన్నది.
జిల్లాలో యాసంగిలో 3.70 లక్షల మెట్రిక్ ట న్నుల వరి ధాన్యం లక్ష్యం పెట్టుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖ అనుకున్న మేర లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. ఇందుకోసం ప్రభుత్వం 481 కొనుగోళు సెంటర్లను ఐకేపీ, పీఏసీసీఎస్, మెప్మాల నుంచి ఏ ర్పాటు చేసింది. ఇలా ఈ సెంటర్ల ద్వారా సగం ధా న్యం కూడా కొనుగోళ్లు చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ సెంటర్ల ద్వారా మొత్తం 2లక్షల 65వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రారంభంలో సెంటర్లు ప్రారంభించక రైతు లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మద్దతు ధరకు సమానంగా ప్రైవేట్‌లో కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మిల్లర్ల సమస్య.. గోడౌన్ల కొరతలులాంటివన్ని కొనుగోళ్లలో సమస్యలను తెచ్చిపెట్టాయి. ఈ సమస్యల మధ్యలో ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. బోనస్‌కు ఎదురు చూడకుండా అధికశాతం రైతులు ప్రైవేట్ వారికే సన్నరకం ధాన్యాన్ని విక్రయించుకున్నారు. ఈ క్రమంలో ప్ర భుత్వ కొనుగోళ్ల లక్ష్యం సగానికి అటు.. ఇటుగా మిగిలిపోయాయి.
25 రోజుల కిందట సన్నరకం ధాన్యం గోపాల్పేట సింగిల్‌విండో కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్న. బోనస్ డబ్బులు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. 295 క్వింటాళ్ల ధాన్యం అమ్మిన. రూ.1,47,500 బోనస్ రావాలి. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి. యాసంగి సీజన్ పోయి వానకాలం సీజన్ వచ్చింది. అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పుడు అప్పుడంటూ దాటవేస్తున్నారు. ఎవరు భరోసా ఇవ్వడం లేదు. సక్రమంగా ఇవ్వలేనప్పుడు చెప్పడమెందుకు, రైతులను ఇబ్బందికి గురిచేయడం ఎందుకు. సన్న రకం పెట్టాలని చెప్పింది మీరే, బోనస్ ఇస్తామన్నది మీరే. తీరా డబ్బుల వరకు వచ్చే సరికి నరకం చూపెడుతున్నారు.
– గంటా రాంరెడ్డి, రైతు, గోపాల్పేట మండలం
నేను దొడ్డు వడ్లు అమ్ముకుని 15 రోజులైంది. ఇంత వరకు డబ్బులు రాలేదు. వడ్లు కొన్న కేంద్రం వాళ్లను అడిగితే వస్తాయి.. మా చేతుల్లో ఏమీ లేదంటున్నారు. సర్కారు వేసినప్పుడే డబ్బులు వస్తాయని చెబుతున్నారు. 45 క్వింటాళ్లు ఐకేపీ సెంటరులో అమ్మినా. డబ్బులు వస్తే.. అప్పులైనా కట్టుకుందామంటే రావడం లేదు. ఎప్పుడు వస్తావో ఎవరూ చెప్పడం లేదు. ఎన్ని రోజులు ఎదురు చూడాలే. వడ్లు అమ్మినం కానీ.. డబ్బులు రావడం లేదు. ఏ పని చేసుకోవాలన్నా డబ్బులు కావాలే. మేం తెచ్చుకున్న చోట టైంకు డబ్బులు కట్టక పోతే మా మాటలు పోతున్నాయి. మమ్మల్ని అవస్థలు పెట్టడం సరికాదు. తొందరగా డబ్బులు వేసి మా బాధ తీర్చండి.
– శివమ్మ, మహిళా రైతు, కేతేపల్లి, పాన్‌గల్ మండలం