అయిజ, ఫిబ్రవరి 9 : తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం నిలిచి పోతుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ తగ్గుతోంది. టీబీ డ్యాం నుంచి నీటి విడుదల నిలిచిపోయి ఐదు రోజులకే ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ తగ్గుముఖం పట్టణంతో ఆర్డీఎస్ రైతులతోపాటు అధికారుల్లో ఆందోళన మొదలైంది. మార్చి చివరి వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఆయకట్టులో యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి మట్టం తగ్గుతుండడంతో పంటలు సాగు చేసిన రైతుల్లో గుబులు రేకెత్తుతోంది.
ఆర్డీఎస్ నీటి వాటా 5.8 టీఎంసీలకు గానూ ఇప్పటికే 3 టీఎంసీల నీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. మరో 2.8 టీఎంసీలు మిగిలి ఉండగా, ఈ నెల 12 నుంచి మరో టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని కర్నూల్ కేసీ కెనాల్ ఇండెంట్ నీటిని ఆర్డీఎస్ ఇండెంట్‌తోపాటు జాయింట్‌గా విడుదల చేస్తేనే ఆర్డీఎస్తోపాటు కేసీ కెనాల్ ఆయకట్టు, కర్నూల్ నగరపాలక సంస్థ, తుంగభద్ర నదితీర ప్రాంత గ్రామాలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తీరతాయని ఇరు రాష్ర్టాల రైతులు, అధికారులు భావిస్తున్నారు. ఆర్డీఎస్ ఇండెంట్‌తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్‌ను ఈ నెల 12నుంచి విడుదల చేసేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. టీబీ డ్యాం నుంచి నీటి విడుదల నిలిచిచిపోయిన ఐదు రోజులకే ఆనకట్టలో నీటి నిల్వ 7.5 అడుగులకు తగ్గిపోవడంతో ప్రధానకాల్వకు నీటి చేరికలో వ్యత్యాసం వస్తుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఎగువ ప్రాంత రైతులు నీటిని అక్రమంగా తోడేయడంతోనే ఒక్కరోజులోనే 0. 5 అడుగులు ఆవిరైపోవడంతో ఆనకట్టలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రధానకాల్వకు 423 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. ఈ నెల 12నుంచి ఆర్డీఎస్ నీటి వాటా నీటిని టీబీ డ్యాం నుంచి విడుదల చేసేందుకు ఈఎన్సీకి ఇండెంట్ పంపామని, సోమవారం ఉత్తర్వులు టీబీ బోర్డుకు చేరుతాయన్నారు.