వనపర్తి, మే 1(నమస్తే తెలంగాణ) : జిల్లాలో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా ప్రజలను కబలిస్తుంది. ఏటికేటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం, గ్రామాల్లో అవగాహన లేక అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ కారక వ్యాధులకు ప్రభుత్వ పరంగా చికిత్సలు, మందులు ఉచితంగా అందించే వెసలుబాటు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రజలకు చేరడం లేదు. ఈ క్రమంలో రోజు.. రోజుకు గ్రామాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అర్ధాంతరంగా మృత్యువాత పడుతూనే ఉన్నారు.
జిల్లాలో క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తున్న వేళ మేధావులు, యువకులు, రచయితలు, కవులు, కళాకారులు దీనిపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవశ్యకత కనిపిస్తుంది. ఈ వ్యాధి గుర్తించేందుకు, అనంతరం చికిత్సలు అందించేందుకు జిల్లా కేంద్రంలోని దవాఖానలో అన్ని సౌకర్యాలున్నాయి. ఇందుకు ప్రత్యేక వార్డును రెండేళ్ల కిందటే 8మంది సిబ్బందితో ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి బారిన పడిన రోగులు క్రమం తప్పకుండా ఈ కేంద్రంలో చికిత్సలు పొందుతున్నారు. అవసరమైన పేషెంట్లకు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే దవాఖాన నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకొని మెరుగైన చికిత్సను అందించే వెసలుబాటు ఉంది.
గడచిన రెండేళ్లలో జిల్లాలో 404 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. పేదరికం, నిరక్షరాస్యతతో గ్రామీణులకు క్యాన్సర్‌పై ఎలాంటి అవగాహన లేదు. ఈ వ్యాధి సోకిందని చెప్పాలన్నా కూడా జంకుతున్నారు. ఏమనుకుంటారని బేంబేళెత్తుతూ రోగాన్ని పెంచుకొని మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం మరణాలకు సంబంధించి గ్రామస్థాయిలో ఎలాంటి రికార్డులు మెయింటెనెన్స్ చేయనందునా మరణాలు కాకి లెక్కల్లోకి వెళ్తున్నాయి. దాదాపు ప్రతి గ్రామంలోనూ క్యాన్సర్ బారిన పడి ప్రతిఏటా పదు లు సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వ్యాధిని మొదట్లో గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా చివరిదశలో దవాఖానలకు వెళ్లడం వల్ల వైద్యులు కూడా నిస్సాహాయులవుతున్నారు. ఈ పరిస్థితిలో ఈ వ్యాధి బారిన పడిన అనేక మంది మృతిచెందుతున్నారు. జిల్లాలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కాలానుగుణంగా మారుతున్న జీవన విధానాల వల్లే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. పూర్వపు రోజుల్లో ఉన్న మంచి అలవాట్లను దూరం చేసుకొని తాత్కాలిక ఆనందాలను ఇచ్చే వాటివైపు సమాజం వేగంగా పరుగులు తీస్తుంది. ఓ 30 ఏళ్ల వెనక్కి వెళితే..చాలా వరకు గ్రామాల్లో 100ఏండ్ల్ల వృద్ధులు ప్రతి ఇంట్లో ఉండేవాళ్లు. ప్రస్తుతం పల్లెటూళ్లలోనూ వృద్ధుల జాడ కనుమరుగవుతుంది. అంతా అర్ధాయుష్యు అన్నట్లుగా జీవన విధానం మార్పులతో వివిధ అనారోగ్యాల బారిన పడి మధ్యలోనే తనువులు చాలిస్తున్నారు. దురలవాట్లు, క్రిమి సంహారాలతో పండిన ఆహార ధాన్యాలు తినడంలాంటి వాటితో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. వ్యాధిపై అవగాహన ఉంటే ఆదిలోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు గంటా పథంగా చెబుతున్నారు. పురుషుల్లో నోటితోపాటు వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా, మహిళలలో రొమ్ము, సర్విక్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం ఉన్నప్పటికీ ప్రజలు నామమాత్రంగా ఉపయోగించుకుంటున్నారు.
నోటి, రొమ్ము, సర్విక్ క్యాన్సలర్ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్‌లో రక్తం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే సర్విక్ క్యాన్సర్‌గా భావించి హెచ్‌పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా ముందస్తుగా గుర్తించే వీలుంటుంది. నోటి అల్సర్లు, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్ పరీక్ష చేయించాలి.
క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు హెచ్‌పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో గత నెల వరకు వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో 14 నుంచి 15 ఏండ్ల వయస్సు పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మహిళల్లో అధికంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను నివారించాలని ముందస్తుగా బాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నారు.
క్యాన్సర్‌ను మొదట్లో గుర్తిస్తే నయం చేయవచ్చు. రొమ్ము, సర్విక్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే వై ద్యం పొందాలి. నిత్యం అరగంట వ్యా యామం చేయాలి. భోజనంలో ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా ఉండాలి. రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. ఆరోగ్య అలవాట్లను మీ హద్దులో ఉంచుకుంటే ప్రారంభంలో వ్యాధిని నయం చేయడం అంత కష్టమైన పనేం కాదు. చాలా విలువైన చికిత్సలు, మందులు ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలు అవగాహన పెంచుకుని చైతన్యం కావడంతోనే క్యాన్సర్‌ను అరికట్టే అవకాశం ఉంది. ఎలాంటి అనుమానాలు లేకుండా తక్షణమే దవాఖానకు రావాలి. జిల్లాలో నోటి క్యాన్సర్ 24, రొమ్ము క్యాన్స ర్ 112, గర్భాశయం 124, ఇతర క్యాన్సర్లు 144 కేసులున్నాయి.
– అరుణకుమారి, సూపరింటెండెంట్, జిల్లా దవాఖాన, వనపర్తి