జడ్చర్ల, సెప్టెంబర్ 5 : హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసుల కళ్లుగప్పి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా.. మహబూబ్‌నగర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కా సమాచారం మేరకు గురువారం జడ్చర్ల బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో రాష్ట్ర రాజధాని నుంచి వచ్చిన ట్రాలీ ఆటో (టీఎస్ 06 యూడీ 8908)ని నిలిపి తనిఖీలు చేశారు.
అందులో 60 బ్యాగుల (ఒక్కో బ్యాగులో 30 కేజీలు) బెల్లం.. మొత్తం 1800 కిలోలు, 10 లీటర్ల నాటుసారా ను, 20 కేజీల పటికను పట్టుకున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కాట్రావత్ శ్రీనును అరెస్ట్ చేశారు. తెలకపల్లి మండలం దేవదారుకుంటకు తీసుకెళ్తున్నట్లు వివరించాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని శివరాంపల్లి ఎక్స్రోడ్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడే ఆగి ఉన్న లారీ (కేఏ 28 బీ 6609) తనిఖీ చేయగా.. అందులో 650 (ఒక్కో సంచి 30 కేజీలు) సంచుల నల్ల బెల్లం.. మొ త్తం 19,500 కేజీలు, 40 కేజీల పటిక, 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రఫీని అరెస్టు చేశారు.
నాగర్‌కర్నూ ల్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాలకు తరలించి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. రెండు వాహనాల్లో కలిపి మొత్తం 21.3 టన్నుల బెల్లం (విలువ రూ.68.5 లక్షలు) ఉం టుందని అధికారులు అంచనా వేశారు. పట్టుకున్న అధికారులు, సిబ్బందిని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శారద, విప్లవరెడ్డి, ఎస్సై సృజన్‌రావు, నాగరాజుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.