కృష్ణమ్మ ఈ ఏడాదికి ముందుగానే జూరాలను తాకింది. దాదాపు 44 రోజులుగా ఉప్పొంగి ఉరకలు వేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జూరాలకు వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపి రైతుల కళ్లల్లో వెలుగులు నింపేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ముందస్తు నీళ్లు వచ్చినా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వెళ్తున్నా మొద్దు నిద్ర వీడడం లేదు. దీంతో రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నీరులేక వెలవెలబోతు కనిపిస్తున్నాయి. కృష్ణమ్మకు వచ్చిన నీరంతా ఇలా దిగువకు వెళ్తుంటే మాకు సాగునీరు ఎప్పుడు అందిస్తారా.. అని రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నది.
– వనపర్తి, జూలై 12 (నమస్తే తెలంగాణ)
కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న తొలి ప్రాజెక్టు జూరాలకు ఈ ఏడాది ముందుగానే వరదలు వచ్చాయి. దాదాపు 44 రోజులుగా కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు పోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రవీడడం లేదు. దీంతో ఉ మ్మడి జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు సాగునీరులేక వెలవెల బోతున్నాయి. ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు ఆధారంగా సాగునీటి వనరులను బీఆర్ఎస్ ప్రభు త్వం కల్పించింది. సమిష్టి రా ష్ట్రంలో శిలాఫలకాలను వేసి వదలేసిన వాటిని గత కేసీఆర్ సర్కార్ వినియోగంలోకి తెచ్చింది.
వీటి ద్వారా సుమారు పది లక్షల ఎకరాలకుపైగా సాగుబడులకు భీమా, ఎంజీకేఎల్ఐ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడ్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించిన విషయం విధితమే. ప్రధానం గా భీమా, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుల ద్వారా వరదలను అనుసరించి చెరువులను నింపుతూ పుష్కలంగా నీరందించడం ఆనవాయితీ. ప్రస్తుత వానకాల సీజన్ ముందస్తుగానే వచ్చేసింది. అందుకు సరిపడా కృష్ణానది నీళ్లు సహితం వరదల రూపంలో దిగువకు పరుగెత్తుతూనే ఉన్నాయి. ఇలా కిందకు వెళ్తున్న వరద నీటిని చూస్తూ మాకు సాగునీరెప్పుడంటూ ఉమ్మడి పాలమూరు రైతుల కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి.
దిగువకు 200 టీఎంసీలు..
జూరాల ప్రాజెక్టు ద్వారా ఈ వానకాల సీజన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 210 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. కర్ణాటక ఎగువ ప్రాంతంలోని డ్యాంల నుంచి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా కిందకు పంపిస్తున్నారు. అయితే, మే 29 నుంచి జూరాలకు ఇన్‌ప్లో మొదలు కావడంతో అదేరోజు నుంచి 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నాటి నుంచి నేటి వరకు దాదాపు 44 రోజులుగా జూరాల నుంచి వరద దిగువకు వెళుతూనే ఉన్నది. శనివారం సైతం లక్ష క్యూసెక్కులకుపైగా దిగువకు విడుదల చేశారు. ఇలా వెళ్లిన నీరు మొత్తంగా చూస్తే.. 220 టీఎంసీలకు పైగా కృష్ణార్పణం అయినట్లు అంచనా.
ఖాళీగా చెరువులు.. రిజర్వాయర్లు..
జూరాల ప్రాజెక్టు నుంచి వందలాది టీఎంసీల నీరు దిగువకు వెళుతుంటే.. కళ్లప్పగించి చూడటం తప్పా మరేంలేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వెలువడుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని చెరువులు, రిజర్వాయర్లు సహితం సాగునీరు లేక వెలవెలబోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండి దిగువకు గేట్లు ఎత్తిన అనంతరం ఇక్కడి సర్కార్‌కు మేళకువ వచ్చింది. నాలుగు రోజుల కిందట ఎంజీకేఎల్ఐ మోటర్లను ప్రారంభించి ఎట్టకేలకు చేతులు దులుపుకొన్నది.
అయితే ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లన్నీ అధికభాగం ఖాళీగానే ఉన్నాయి. ఇదే ప్రాజెక్టుపై ఆధారపడ్డ చెరువులకు సహితం సాగునీరు అందలేదు. దాదాపు 574 చెరువులు 55వేల ఎకరాల ఆయకట్టున్న ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుపై ఆధారపడ్డాయి. ఇక భీమా-2లోను 136 చెరువులుంటే, వీటికి సహితం సాగునీరు చేరలేదు. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన శంకరసముద్రం, రంగసముద్రం రిజర్వాయర్లలోనూ కనిష్ఠ స్థాయిలోనే నీటినిల్వలున్నాయి.
ఇప్పటి వరకు రంగసముద్రంకు నీటి పంపిణీ మొదలు కాలేదు. నెల రోజులు నీటి విడుదల కొనసాగిన రంగసముద్రం నీటిమట్టం లెవల్‌కు చేరుకోవడం కష్టం. ఇలా చెరువులు, రిజర్వాయర్లు ఎక్కడికక్కడ సాగునీరు లేక రైతులను వెక్కిరిస్తున్నట్లుంది. రైతులు చేసుకున్న పాపమా.. కాంగ్రెస్ ప్రభుత్వ శాపమా అన్నట్లు ఉమ్మడి జిల్లా నుంచి కృష్ణమ్మ పరుగులు పె డుతూ వెళుతుంటే.. పాలమూరు భూములకు సమయానికి సాగు నీరందించలేని దుస్థితి ఉన్నది.
మొద్దునిద్రలో ప్రభుత్వం..
నెల రోజుల నుంచి కృష్ణానదికి వరదలు పోటెత్తినా.. ఇక్కడి రిజర్వాయర్లు.. చెరువులను నింపాలన్న కనీస ఆలోచన చేయకుండా ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన రైతాంగానికి చెంపపెట్టులా ప్రభుత్వం వ్యవహరించిందని రైతులు, మే ధావులు ఆవేదన చెందుతున్నారు. జూరాల నిండిన అనంతరం ఇక్కడి సాగునీటి వినియోగంపై దృష్టి పెట్టి ఉంటే ఏ ఒక్క చెరువు, రిజర్వార్లు ఖాళీగా ఉండేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒక్కొక్కసారి ఒక్కోరీతిలో వానకాలం సీజన్ వస్తుంటుంది. వాటికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే సాగుబడులకు నీటి సమస్య లేకుండా బయటపడే అవకాశాలుంటాయి. ఆలస్యంగా సాగుబడు లు చేయడం వల్లనే చివరలో నీటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని పేర్కొంటున్నారు.
నీటి కోసం ఎదురుచూపులు
చెరువులు, కాల్వ నీళ్లు ఎప్పుడొస్తాయని రైతులు ఎదురు చూస్తున్నారు. నెల రోజులకుపైగా జూరాల నుంచి నీళ్లన్నీ నదిలోకి పోతున్నాయి. మా చెరువులు చూస్తే ఖాళీగా ఉన్నాయి. రైతుల కడుపు మండుతుంది. మా ఒక్క పెద్దమందడి మండలంలోనే 20 చెరువులకుపైగా ఎంజీకేఎల్ఐ కాల్వ నీరు రావాలి. అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నెలరోజుల సీజన్ వెనక్కి వెళ్లినట్లే. సిద్ధంగా ఉన్న నీటిని కూడా రైతులకు అందించలేని దీనస్థితిలో కాంగ్రెస్ పాలకులు ఉండటం రైతుల దురదృష్టం.
– విట్టా శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, అమ్మపల్లి, పెద్దమందడి
మంత్రులు,ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు..
వ్యవసాయానికి అనుగుణంగా వర్షాలు వచ్చినప్పటికీ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడి రైతులను పట్టించుకోలేదు. కేవలం వారి రాజకీయాలను చేసుకుంటున్నారే తప్పా.. రైతులను.. వ్యవసాయాన్ని గాలికి వదిలారు. ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి వందలాది చెరువులను నింపాల్సి ఉన్నది. ప్రస్తుతం చెరువులకు నీరొచ్చేది ఎప్పుడు.. అవి నిండేది ఎప్పుడు.. పంటలు సాగు చేయాల్సింది ఎప్పుడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఒత్తిడికే ఎంజీకేఎల్ఐ మోటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. తక్షణమే ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రిజర్వాయర్లు, చెరువులను నింపాలి.
– వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి, వనపర్తి