నవాబ్‌పేట, డిసెంబర్ 26 : తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి, మీకు ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గిరిజనులంతా ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమన్నారు. శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ నాయకత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ ఉపసర్పంచ్ తౌర్యానాయక్, వార్డు సభ్యులు రవినాయక్, కిషన్‌నాయక్, మారుబాయి, పద్మాబాయి, చిన్నబాయి, నాయకులు భగవాన్నాయక్తోపాటు మరో 200 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు కారు పార్టీలో చేరారు. నవాబ్‌పేట మండలంలోని నాలుగు తండాల వాసులు బీఆర్ఎస్కు జై కొట్టాయి.
వెంకటేశ్వరతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిచెట్టుతండా, ఎర్రవాడ్కతండా, కోమటికుంట తండాకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్‌తోపాటు ఆరుగురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజ మహిళలు మూకుమ్మడిగా గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కండువాలు కప్పిన ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రెండేండ్ల తర్వాత మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కీర్తిలతాగౌడ్, కొల్లూరు సర్పంచ్ సేవ్యానాయక్, నాయకులు రాజు, చందర్‌నాయక్, కృష్ణయ్యగౌడ్, బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.