అలంపూర్/అలంపూర్ చౌరస్తా, అక్టోబర్ 24 : రాత్రి వేళ ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో బైక్ రూపంలో వచ్చిన ప్ర మాదం శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. ట్రావెల్ బస్సును బైక్ ఢీకొట్టడంతో దావణంలా వ్యాపించిన మంటల్లో కొందరు అప్రమత్తమై కిందకు దూకి గాయాలతో బయటపడగా.. మరికొందరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై మంటల్లో కాలి మాంసపు మద్దలుగా మిగిలిపోయారు. 43 మంది ప్రయాణికుల్లో 19 మంది సజీద దహనం కాగా, మిగిలిన వారు గాయాలతో బయటపడిన ఘటన బెంగళూరు-హైదరాబాద్ 44వ జాతీయ రహదారిపై శు క్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి 9:30 గంటలకు బెంగుళూర్‌కు బయలుదేరింది. బస్సులో సుమారుగా 43 ఉంది ఉం డగా, వారిలో 39 మంది పెద్దవారు, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2:15గంటలకు పుల్లూ రు టోల్‌ప్లాజా దాటి కర్నూలు మీదుగా ట్రావెల్ బస్సు వెళ్తున్నది. సుమారు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టి 300మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న కర్నూ ల్ పట్టణం ప్రజానగర్ తండ్రాపాడుకు చెందిన శివశంకర్(24) ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ను బస్సు ఈడ్చుకుపోవడంతో రాపిడికి బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి బస్సులో మ ంటలు చెలరేగాయి. గమనించిన బస్సు డ్రైవర్, విశ్రాంతిలో ఉన్న మరో డ్రైవర్ ఇద్దరూ బస్సు దూకి తప్పించుకున్నారు. మంటలు, ప్రమాదాన్ని పసిగట్టిన మెలకువలో ఉన్న కొంతమంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు, తప్పించుకోవడానికి వీలులేని ప్రయాణికులు మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో 19 మంది (17 మంది పెద్దవారు, ఇద్దరు చిన్నారులు), బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తితో కలిపి మొత్తం 20మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో 24మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, క్షతగాత్రులను కర్నూలు సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు.
బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారు మాంసంపు ముద్దలుగా మిగిలారు. మృతిచెందిన వారు ఎవరో కూడా గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ద్వారా మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారు లు వివరించారు. మృతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ధాత్రి హైదరరాబాద్ నుంచి.. ఖైరతా బాద్‌లో ఎక్కిన అనూషరెడ్డి ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా విం జమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన రమేశ్, అనూష, మన్విత, మనీశ్ ఒకే కుటుంబం వారు మృతుల్లో ఉన్నారు.
బస్సు ప్రమాదాన్ని చూస్తే హృదయ విదారకరంగా ఉందని.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. కర్నూలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాద ఘటనపై విచారణ, మృతదేహాలను గుర్తు పట్టడానికి ఫోరెన్సిక్‌కు సంబంధించిన 16 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కారణమైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 6 మంది, తెలంగాణకు చెందిన వారు 6మంది, ఒరిస్సా రాష్ర్టానికి చెందిన వారు ఒకరు, బీహార్, ఒడిస్సాకు చెందిన వారు ఒక్కొక్కరు, తమిళనాడు చెందిన వారు ఇద్దరు, కర్ణాటకకు చెందిన వారు ఇద్దరుగా గుర్తించామన్నారు. ఇద్దరు డ్రైవర్లలో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని విషయాలు, అన్ని కోణాల్లో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం స్థలా న్ని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రితోపాటు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, డీఐజీ ప్రవీణ్, కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే చరిత, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్, కొడు మూరు ఎమ్మెల్యే దస్తగిరి తదితరులు ఉన్నారు. వీరితోపాటు తెలంగాణ రాష్ర్టానికి చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్, ఎస్పీ, ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖల అదికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సును తొలగించే యత్నంలో క్రేన్ బోల్తా పడింది. క్రేన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
మన్నెంపల్లి సత్యనారాయణ ఖమ్మం, బడంత్ర జయసూర్య హైదరాబాద్‌లోని మియాపూర్, నవీన్‌కుమార్ హయత్‌నగర్, సరస్వతి, హారిక బెంగళూరు, రమేశ్ నెల్లూరు, శ్రీలక్ష్మి నెల్లూరు, అశోక్ హైదరాబాద్, శ్రీహర్ష నెల్లూరు, పుసుపట్టి కీర్తి ఎస్ఆర్ నగర్, వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్. ఎంజీ రామారెడ్డి తూర్పు గోదావరి, సుబ్రహణ్యం కాకినాడ, అశ్విన్ రెడ్డి, ఆకాశ్, జయంత్కుశ్వాల్, పంకజ్ ప్రజాపతి, గుణసాయి, శివగణేశ్, గ్లోరియా ఎల్సాసామ్, చారిత్ బెంగుళూరు, మొహ్మద్
ఖిజార్ బెంగుళూరు, బస్సు డ్రైవర్లు లక్ష్మయ్య, శివనారాయణ ఉన్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన తరుణ్ టికెట్ రిజర్వ్ చేసుకొని అనివార్య కారణాల వల్ల టికెట్ రద్దు చేసుకొని బస్సు ఎక్కలేదు.
బెంగుళూరుకు చెందిన ఫిలమిన్ బేబి(60), ఆమె కుమారుడు కిశోర్‌కుమార్(41) దీపావళి పండుగకు హైదరాబాద్‌లోని పటాన్చెరు ప్రాంతంలో నివాసముండే బంధువుల ఇంటికి వెళ్లారు. వారి బంధువులతో కలిసి అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొన్నారు. అదే వారి జివాతాల్లో చివరి పండుగగా మిగిలింది. హైదరాబాద్ నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఎక్కారు. ప్రమాదంలో బేబి, కిశోర్‌కుమార్ మృతిచెందగా, వారి కుటుంబాల్లో చీకటి రోజుగా మిగిలింది. తెలంగాణలోని గుండాల మండలం కొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషరెడ్డి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది. దీపావళికి స్వగ్రామానికి వచ్చి తిరిగి బెంగుళూరుకు వెళ్తుండగా బస్సు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహాలను చూసి బాధిత కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 24 : హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారు జామున కర్నూల్ జిల్లా కల్లూర్ మండలం చిన్నటేకూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సుకు జరిగిన అగ్ని ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 19మంది ప్రయాణికులు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడంపై ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, వెంటనే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా బస్సు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.