వనపర్తి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు ఖాళీలు ఉండడంతో విద్యార్థులకు బోధన కరువై నిర్లక్ష్యపు నీడన ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చినా కొన్ని కళాశాలలో ఆంగ్లం, హిస్టరి బోధించడానికి అధ్యాపకులు కరువయ్యారు. జిల్లా మొత్తంలో 14 అధ్యాప పోస్టులు ఖాళీలుండగా, ఐదు కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లే దిక్కయ్యారు. దీంతో ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్ట్, సెకండియర్ కలిపి మొత్తం 100మంది విద్యార్థులు ఉండగా వీరంతా నాలుగు గ్రూపుల వారీగా విద్యను కొనసాగిస్తున్నారు. అయితే ఈ కళాశాలలో ముందు నుంచి హిస్టరీ అధ్యాపకులు లేరు. దీంతో హెచ్ఈసీలో చేరేందుకు వచ్చిన చాలామంది విద్యార్థులను విధిలేక సీఈసీకి మళ్లిస్తున్నారు. అయితే హెచ్ఈసీలో కొందరు సెకండియర్ విద్యార్థులున్నారు. వీరికి సంబంధిత సబ్జక్టులో బోధనలు లేక దిక్కులు చూస్తున్నారు. వీపనగండ్ల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్‌లో 70మంది, సెకండియర్ 70మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలలో ఇప్పటి వరకు ఇంగ్లిష్ పుస్తకం తెరుచు కోలేదు. ఆంగ్లం బోధించే అధ్యాపకుడు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేసింది. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా టీఎస్‌బీఐఈ (తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్) ప్రకటించింది. జూలై 1వతేదీ నుంచి ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఏడు నెలలుగా విద్యాభ్యాసం కొనసాగుతున్నది. జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, వీటిలో ఫస్ట్, సెకండియర్‌కు సంబంధించి 13,237 మంది విద్యార్థులు విద్యాభాస్యం కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ జారీ అయినా నేటికి జిల్లాలో కొన్ని కళాశాలల్లో ముఖ్యమైన పుస్తకాలే తెరుచుకోలేదు. ఒక్కొక్క చోట ఒక సబ్జెక్టుకు సమస్య ఉన్నది. ఒక వైపు పరీక్షల తేదీ దగ్గరపడుతున్నా..మరోపక్క ఇలా పుస్తకాలు కూడా తెరుచుకోని దీన పరిస్థితి ప్రభుత్వ కళాశాలల్లో కొనసాగుతున్నది. ఉత్తీర్ణతలో ప్రైవేట్ కళాశాలతో పోటీపడి ఫలితాలను సాధించాలని చెప్పే అధికారులు ఇప్పటి వరకు పుస్తకాలే తెరవని పరిస్థితులను ఎందుకు గుర్తించడం లేదో అర్థంకాని పరిస్థితి. ఇంగ్లిష్ లాంటి సబ్జెక్టులో ఇప్పటివరకు పుస్తకాలే తెరవని పరిస్థితి నెలకొందంటే జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 14 పోస్ట్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 60కి పైగా వివిధ పోస్ట్టులు ఖాళీగా ఉంటే, రెండు నెలల కిందట గెస్ట్ లెక్చరర్లను తీసుకున్నారు. అయినా ఇంకా కొన్నిచోట్ల రెగ్యులర్, అతిథి అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం గెస్ట్ లెక్షరర్స్ లెక్చరర్ల ద్వారా అయినా బోధన చేస్తే సమస్య ఉండేది కాదు. వనపర్తి, వీపనగండ్ల కళాశాలల్లో 2 ఇంగ్లిష్, హిందీలో 2, వనపర్తి బాలుర, బాలికల కళాశాలలు, హిస్టరీ 2 పోస్టులు, ఖిల్లాఘణపురం, పెబ్బేరులో కెమిస్ట్రీ 3 పోస్ట్టులు, వనపర్తి బాలుర, బాలికల కళాశాలలు బాటనీ 1, పిజిక్స్ 1, వనపర్తి కళాశాల, ఎంపీహెచ్‌డబ్ల్యూ 1 వనపర్తి, పీఎస్టీటీ 1 వనపర్తి మాథ్స్ 1 శ్రీరంగాపురం కళాశాలలో ఖాళీలున్నా యి. ఈ సబ్జెక్టుల వారీగా ఆయా కళాశాలల్లో ఇప్పటి వరకు పుస్తకమే తెరవ లేదు. అయితే వనపర్తి బాలికల కళాశాలలో కెమిస్ట్రీ సబ్జెక్టును పక్క కళాశాల లెక్చరర్ల ద్వారా బోదన చేయిస్తున్నట్లు సమాచారం. ఒక్క సబ్జెక్టులో విద్యార్థి బోధనలు లేక దెబ్బతిన్నా ఇంటర్ ఫలితాలన్నీ తారుమారవుతాయి.
జిల్లాలోని 12 కళాశాలలకుగానూ ఐదు కళాశాలలకు ఇన్చార్జి ప్రిన్సిపాళ్లే కొనసాగుతున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రెండు కళాశాలలను అప్పగించడంతో పర్యవేక్షణ కరవుతున్నది. ఇన్చార్జిలుగా బాధ్యతలు తీసుకున్నారే తప్పా ఆయా కళాశాలలకు వెళ్లడం మాత్రం అంతంతే. నెలకు ఒకసారి వెళ్లడమే గగనం. జిల్లాలో పాన్‌గల్, శ్రీరంగాపురం, వీపనగండ్ల, పెద్దమందడి, ఆత్మకూరు కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు, ఇప్పటికీ తెరుచుకోని పుస్తకాల సమస్యలపై వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి హైదరాబాద్‌లో బోర్డు మీటింగ్‌కు వెళ్లారని జిల్లా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేశ్ బాబు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.
మాకు హిస్టరీ లెక్చరర్ లేరు. ముందు నుంచి ఇదే పరిస్థితి. మేమే సొంతంగా చదువుకుంటున్నాం. ఎవరైన వి ద్యార్థులు హెచ్ఈసీలో చేరేందుకు వచ్చినా ఇతర గ్రూపులో చేరుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు మాత్రం రావాలంటారు కానీ, వాస్తవ పరిస్థితులను చూడటం లేదు. చదువు చెప్పే వారే లేకుంటే పరీక్షలో ఏమీ రాస్తాం.
మాకు ఇంత వరకు ఇంగ్లిష్ బోధన ప్రారంభం కాలేదు. కనీసం దగ్గరలో ఉన్న కళాశా ల లెక్చరర్ల ద్వారానైనా చెప్పిస్తారనుకున్నాం. ఏడు నెలలవుతున్నా ఇంగ్లిష్ వైపు చూడ టం లేదు. మొదలు పెట్టేలోపు పరీక్షలు అయ్యేలానే ఉన్నాయి. ఇలా ఉంటే పరీక్షలు ఎలా రాస్తాం.
ఇంగ్లిష్ లెక్చరర్ కోసం ఎదురు చూస్తున్నాం. పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించా రు. కనీసం రెండునెలల సమ యం కూడా లేదు. ప్రభుత్వ కళాశాలపై నిర్లక్ష్యం ఉందనడానికి ఇదే ఉదాహరణ. పరీక్షల ముందు వచ్చి హడావుడి చేసినా పెద్దగా ఫలితం ఉండదు. బోధనలు లేకుండా చదువును ఎలా నెట్టుకు వస్తామో అధికారులు ఆలోచించాలి.