నాగర్‌కర్నూల్/అచ్చంపేట, మార్చి 6 : ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8మంది కార్మికుల ఆచూకీ అంతుచిక్కడం లేదు. మృతదేహాల కోసం 13వరోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ప్రతిరోజూ రెస్క్యూ బృందాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. టన్నెన్లో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు గురువారం కేరళ నుంచి రెండు క్యాడవర్ డాగ్స్‌ను రెండు ఆర్మీ హెలీకాప్టర్లలో తె ప్పించారు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్ రెస్క్యూ బృందాలు టన్నెల్లో చివరి పాయింట్ వరకు తీసుకొని వెళ్లారు.
భూమిలో అయిదు అడుగుల లోపల మనిషి మృతదేహాలున్నా.. వా టిని గుర్తించడంలో క్యాడవర్ డాగ్స్ పనిచేస్తాయని అధికారులు అంటున్నారు. ఈ డాగ్స్‌ను శవ కుక్కులు అని కూ డా పిలుస్తారు. టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలకు సం బంధించి ఆనవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో గుర్తించే అవకాశం ఉంది. శవాలున్న ప్రదేశాన్ని గుర్తించిన అనంతరం రె స్క్యూ బృందాలు తవ్వకాలు జరిపి మృతదేహాలను బయటకు తీయనున్నారు.
క్యాడవర్ డాగ్స్‌తో రాత్రి వరకు టన్నెల్లో మృతదేహాలున్న ప్రదేశాలను గుర్తించిన అనంతరం శుక్రవారం ఉదయం ఆర్మీ హెలీకాప్టర్లు తిరిగి కేరళ వెళ్లనున్నాయి. ఐఐటీ నిపుణుల బృందం టన్నెల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. కన్వేయర్ బెల్టు మరమ్మతులు పూర్తి చేశారు. 12కిమీ వరకే ఉన్న కన్వేయర్ బెల్టును 13కిమీ వరకు సరిచేశారు. కన్వేయర్ బెల్టును సరిచేసినా.. లోపల నుంచి బురద, మట్టిని బయటకు పంపే ప్రక్రియ చేపట్టలేదు. రాత్రి నుంచి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు మట్టి, బురద పంపించి సహాయక చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు అంటున్నారు.
దక్షిణ మధ్య రైల్వే రెస్క్యూ బృందం టీబీఎం మిషన్ పరికరాలను గ్యాస్‌కట్టర్ ద్వారా కటింగ్ చేసి లోకో ట్రైన్ ద్వా రా బయటకు తరలిస్తున్నారు. టీబీఎం మిషన్ ముందు భాగంలో పరికరాలు తొలగించి మినీ జేసీబీని లోపలికి పంపి యంత్రాల ద్వారా సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జీపీఆర్ డేటా సర్వే ఆధారంగా 8ప్రదేశాలను గుర్తించగా.. నాలుగు ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. అక్కడ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
రెస్క్యూ బృందాలు మరో నాలుగు ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. టీబీఎం మిషన్‌పైన భారీగా పేరుకుపోయిన మట్టి, బురద గట్టిగా మారింది. ఆ ప్రదేశంలో ఆగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది ఫైర్డెట్స్ ద్వారా నీటిని కొట్టి గట్టిగా ఉన్న మట్టిని బురదగా చేస్తూ మిషన్‌పై నుంచి కిందికి జరిపోయేవిధంగా నీళ్లను కొడుతూ సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచి యంత్రాలు లోపలికి తీసుకెళ్లి బురద, శకలాలను బయటకు పంపనున్నారు. లోకోట్రైన్ బోగీలు సరిపోవడం లేదని భావించిన అధికారులు మరోరెండు బోగీలు తయారు చేయిస్తున్నారు. టన్నెల్లోకి భారీగా ఉబికి వస్తున్న నీటి ఊటను అదే మాదిరిగా డీవాటరింగ్ ప్రక్రియ ద్వారా బయటకు పంపుతున్నారు. రెస్క్యూ బృందాలకు సహకారంగా స్నిపర్ డాగ్స్ ద్వారా మృతదేహాలు గుర్తించే అవకాశం ఉంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను గురువారం సాయంత్రం కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మేంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్ టన్నెల్లో ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలను వివరించారు. టన్నెల్లోపల 13:650 కిలోమీటర్ల ప్రాంతంలో టన్నెల్ బోర్మిషన్పై రాళ్లు, మట్టి పడి దాదాపు 150 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్మిషన్ పూర్తిగా ధ్వంసమైందని, అందులోనే 8మంది ఇరుక్కుపోయి ఉన్నట్లు వివరించారు.
నీరు రావడం, మట్టి, రాళ్లతో కలిసి పోయిందన్నారు. ప్రస్తుతం టీబీయం మిషన్‌ను కొద్దికొద్దిగా కట్ చేస్తూ కార్మికులు ముందుకు అన్వేషిస్తున్నారని తెలిపారు. కార్మికులను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రప్పించినట్లు వివరించారు. కన్వేయర్ బెల్టు పనిచేయడం ప్రారంభమైందని, మట్టిని బయటకు పంపించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతమవుతాయని తెలిపారు. అనంతరం టన్నెల్లోకి ఎన్డీఆర్ఎఫ్, కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్‌స్కాడ్‌తో కలిసి సాయంత్రం టన్నెల్లోకి వెళ్లారు. క్యాడవర్ డాగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి, ఏప్రాంతంలో చూపించాలనే విషయాన్ని పరిశీలించి శుక్రవారం ఉదయాన్నే క్యాడవర్ డాగ్స్‌ను స్వ్యాడ్తో సహా పంపించనున్నట్లు తెలిపారు.
కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాండెంట్ పరిక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయప్రకాశ్ అసోసియేషన్ ఎండీ పంకజ్గౌర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం టన్నెల్ వద్ద ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐఐటీ నిపుణులు, సైనిక అధికారులు టన్నెల్లోకి వెళ్లారు. ఒక చివర నుంచి మట్టితీస్తూ ఎక్సలెటర్పై వేస్తూ నీటిని మరోవైపు మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితోపాటు యంత్రాల సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మధ్యాహ్నం వరకు టన్నెల్లోపల పనిచేసేవారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.