వనపర్తి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్ర భుత్వంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు వే తనాల సమస్య వెంటాడుతున్నది. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితులు కార్మికులవి. ప్రతి నెలా జీతం వస్తేనే వారి కుటుంబ బండి నడుస్తుంది. అలాంటిది నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం ద్వారా వారి జీవనం దుర్భరంగా మారింది. మరో పది రోజుల్లో ఉగాది పర్వదినం రాబోతున్న తురుణంలో కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే పం డుగ పూట కూడా వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
గ్రామ పంచాయ తీ కార్మికుల కు ఉగాది సందర్భం గానైనా జీతాలు అందుతాయని ఆశిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడు నెలల నుంచి జీతా లు పెండింగ్‌లో ఉంచడంతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. చివరకు చందాలు అడుక్కుంటూ తాము కడుపునింపుకోవాలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలలు గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీపీలలో పనిచేస్తున్న వారి జీతాల సమస్య వారికి ఎప్పుడూ తలనొప్పిగా మారింది. వచ్చేదే అంతంత మాత్రం జీతాలు..అవి కూడా సమయానికి రాకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ప్రభుత్వమే హైదరాబాద్ నుంచి ప్రతి నెలా నేరుగా కార్మికుల అకౌంట్లలో జీతాలను జమ చేస్తూ వచ్చింది. అయితే.. ప్రస్తుతం మళ్లీ కార్మికులకు జీతాలు రావడం లేదు. కనిపించిన అధికారులనంతా అడుగుతూ పోతున్నారు. చివరకు మళ్లీ పాత పద్ధతినే అవలంభిస్తూ జీపీ నిధుల నుంచి కార్మికుల వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర కమిషనర్ నుంచి జీపీ కార్యదర్శులకు ఇటీవల సర్క్యూలర్ జారీ అయింది. నిబంధనలు ఎప్పుడు ఎలా మారుస్తారో తెలియడం లేదని, అంతా అయోమయంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కాగా.. గతంలో జీపీల అకౌంట్లు ఖాళీగా ఉండేవి. ఇటీవల ఎన్నికల అనంతరం పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావడం, నిధులు కూడా వస్తుండడంతో మళ్లీ పాత పద్ధతిలోనే కార్మికుల జీతాలు చెల్లించాలన్న ఉద్దేశంతోనే సర్కిలర్‌ను జారీ చేశారు.
గోపాల్పేట మండలం ఉగాది పండుగ వారం రోజులు కూడా లేదు. కనీసం పండుగకైనా మా జీతాలు ఇవ్వండి. లేదంటే పస్తులుండాల్సి వస్తుంది. ఇప్పుడు.. అప్పుడు అంటున్నారు. ఎప్పుడు వస్తాయో గందరగోళంగా ఉన్నది. ఇతర ఆపదలు… అవసరాలు వస్తే మా బతుకు గోవిందా అన్నట్టు ఉన్నది. అందుకే ప్రభుత్వం, అధికారులు స్పందించి ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి.
– రాజ్‌కుమార్, కార్మికుడు, పొలికెపాడ్
కార్మికుల వేతనాలను మళ్లీ జీపీ నిధుల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఎంపీడీవోలకు వీటిని పంపాం. కొంత కాలం నేరుగా వారి అకౌంట్లలోనే జీతాలు జమ చేసేవారు. ఇంతకు ముందు చేసినట్లే మళ్లీ ఇప్పుడు ప్రతి నెలా జీపీ నుంచి ఇవ్వాలి. ప్రస్తుతం మూడ్నెళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. కార్యదర్శి బిల్ చేసిన రెండ్రోజుల్లోనే కార్మికుల అకౌంట్లలో జమవుతాయి.
– రఘునాథ్‌రెడ్డి, డీఎల్పీవో, వనపర్తి
ఒకటి కాదు రెండు కాదు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఏం తినాలి. ఎలా పని చేయాలి. మా లాంటి చిన్న జీవితాలు జీ తం వస్తేనే నడిచేది కష్టం. చిన్న జీతాలు కూడా ఇవ్వక పోవడం దారుణం. ఇక నెలల కొద్ది రాకుంటే మా కష్టాలు ఎవరికి చెప్పాలే. సర్కార్ మాకు రావాలిసిన జీతాలు వెంటనే చెల్లించాలి. జీతాల గురించి అడిగితే అంతా పైనుంచే అని చెబుతున్నారు.
– ఎల్లయ్య, కార్మికుడు, చింతకుంట గ్రామ పంచాయతీ, పాన్‌గల్ మండలం