కోయిలకొండ, సెప్టెంబర్ 5 : త్రేతాయుగంలో శ్రీరాముడు నాడయాడిన స్థలంగా ఆపర భద్రాద్రిగా ఖ్యాతిపొందిన శ్రీరామకొండకు మహర్దశ వచ్చింది. సమైఖ్య పాలనలో అభివృద్ధికి నోచుకోని శ్రీరామకొండకు తెలంగాణ ప్రభుత్వంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషితో ఆలయ పునఃనిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.10కోట్లు మంజూరు చేశారు. కోరిన కొర్కెలు తీర్చే మహిమాన్వితమైన శ్రీరామకొండకు అదివారం అమావాస్యతోపాటు శ్రీరామనవమి, అమావాప్య పర్వదినాల్లో వేలాదిగా భక్తులు తరలివస్తారు. గతంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని శ్రీరామకొండకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రూ.కోటి వ్యయంతో ఇది వరకే సీసీ రోడ్డు, ప్రత్యేక విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయించారు.
కోయిలకొండ మండల కేంద్రం సమీపంలోని శ్రీరామకొండకు త్రేతాయుగం నాటి చరిత్ర ఉందని పూర్వీకుల కథనం. శ్రీరాములవారు లక్ష్మణుడితో కొండపై సేదతీరడం జరిగిందని, స్వామి సేదతీరిన చోట రాములవారి కుడిపాదం స్వయంభూగా వెలియగా, తపస్వికులు గుర్తించి అక్కడ ఆలయం నిర్మించి పూజలు చేసినట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఆంజనేయస్వామి అమృత సంజీవిని మూలికను శ్రీరామకొండపై పెట్టడంతో కొండపై ఉన్న చెట్లు, నీరు మహిమాన్వితంగా భక్తులు భావిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీరామకొండను అన్నివిధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన భూమిపూజ, శంకుస్థాపన చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాదాయ శాఖతోపాటు తమిళనాడు నుంచి స్థాపితులు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఏండ్లుగా అభివృద్ధ్దికి నోచుకోని శ్రీరామకొండకు తెలంగాణ ప్రభుత్వంలో దశమారనున్నది. భక్తులకు అన్నివిధాలా సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– కృష్ణయ్య, సర్పంచ్, కోయిలకొండ
మహిమాన్వితమైన శ్రీరామకొండ దేవాలయ పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయం. ఎ మ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. భూమిపూజ సందర్భంగా అఖండ భజన ఏర్పాటు చేస్తాం.
– ఎస్.రవీందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్