నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11 : యాసంగిలో ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను కొనద ని, అందుకే సన్నరకాలు సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక లహరి గార్డెన్ ఫంక్షన్హాల్లో ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్రె డ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు వేదికలను ఏఈవోలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. మట్టి పరీక్షల ప్రాధాన్యత, నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. వరిసాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, నువ్వులు, ఆవాలు, ఆముదం పంటలను సాగు చేసేలా చైతన్యపర్చాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, యాంత్రీకరణ సాగు పెరిగేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉప్పుడు బియ్యం కొనుగోళ్లు చేయమంటుందన్నారు. అందుకే రైతులు సన్న బియ్యం పండించాలన్నారు. యాసంగిలో రైతులు నూనె గింజల పంటలు సాగుచేయాలన్నారు. వచ్చే వానకాలంలో పామాయిల్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ పంటలకు విక్రయించేందుకు రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. వెయ్యి ఇండ్లలో మిద్దెసాగు చేసేలా ప్రణాళిక రచించాలని, కూరగాయలు ఎవరి గ్రామాల్లో వారు సాగు చేసుకునేలా ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను సూచించారు. జిల్లాలో వ్యవసాయ అధికారులకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా సమీక్ష నిర్వహించినందుకు కలెక్టర్ ఉదయ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొన్నారు.