మక్తల్ టౌన్, మే 25: మక్తల్ మార్కెట్ యార్డులోని నూతన కార్యాలయంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రూ.72లక్షలతో నూతనంగా నిర్మించనున్న నూతన మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం దంపతులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ హయాంలో మక్తల్ మార్కెట్ యార్డు రూపురేఖలు మారాయన్నారు. మార్కెట్ యార్డు పరిధిలో రూ.9కోట్లతో మూడు గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.కోటితో షట్టర్ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషితో రైతులకు మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు జిల్లా అధికారి బాలామణి, సెక్రటరీ భారతి, ఏఈ కృష్ణయ్య, శ్రీనివాస్‌గుప్తా, మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, నరేందర్, హరి, చంద్రకాంత్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ శాలం, అశోక్, కృష్ణారెడ్డి, కృష్ణ, సోంభూపాల్ గౌడ్, బుడ్డప్ప, నర్సింహ పాల్గొన్నారు.
రాంలీలా మైదానం అభివృద్ధికి కృషి
-ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్, మే 25: రాంలీలా మైదానంలో కంచె ఏర్పాటుకు అందరూ సహకరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానం చుట్టూ ఎమ్మెల్యే చిట్టెం సొంతంగా రూ.3లక్షల నిధులతో కంచె ఏర్పాటుకు పూనుకున్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో శ్రీ పడమటి ఆంజనేయ చిత్రపటానికి పూజలు నిర్వహించి కంచె ఏర్పాటుకు భూమిపూజ చేశారు. శ్రీపడమటి ఆంజనేయస్వామి ఆవరణలోని కల్యాణ మండపం పైభాగం నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.5లక్షలు ప్రొసీడింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు రాంలీలా మైదానం ఉపయోగపడుతుందన్నారు. రాంలీలా మైదానం కబ్జాకు గురికాకుండా కంచె ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, భీమాచారి, కొత్త శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, రాజుల ఆశిరెడ్డి, చంద్రకాంత్ గౌడ్, ఎంపీటీసీ బలరాంరెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి భీంరెడ్డి, కావలి తాయప్ప, బోయరవి, శేఖర్‌రెడ్డి, రతన్, అమరేందర్, రమేశ్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ సభ్యులు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి
నర్వ, మే 25: గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రభుత్వం కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, స్త్రీ శిశుసంక్షేమ, వ్యవసాయ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీపీ నిధులు పెండింగ్‌లో ఉంచకుండా అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలన్నారు. మరిన్ని నిధులు అవసరమైతే కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సర్పంచులకు తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, జెడ్పీటీసీ గౌని జ్యోతిరెడ్డి, వైస్ ఎంపీపీ వీణావతి, అధికారులు పాల్గొన్నారు.