మహబూబ్‌నగర్, ఏప్రిల్ 12: ప్రభుత్వం చేపట్టిన పనులను అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మన ఊరు-మన బడికి సంబంధించి అంచనాల తయారీలో తప్పులు లేకుండా చూడాలన్నారు. అన్ని మండలాల్లో తక్షణమే పనులు ప్రారంభయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రహరీ, టాయిలెట్ నిర్మాణం, కిచెన్‌షెడ్ వంటి పనులు చేపట్టేందుకు అవకాశం ఉన్నందున పనులకు సంబంధించి ఈసీలు, ఏపీవోలు అంచనా తయారీ చేయాలన్నారు. పాఠశాలలకు సంబంధించి డేటా సీట్లను తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు. డేటా సీట్లతో పాటు ఇన్పుట్ డేటా అంచనా జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, డీఈవో ఉషారాణి, ఇంజినీరింగ్ శాఖల ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, ఎంఈవోలు, తదితరులు ఉన్నారు.
భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి
జాతీయ రహదారుల నిర్మాణం, ఆర్అండ్బీ రహదారులు, రైల్వే తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకట్రావు సంబంధింత అధికారులను ఆదేశించారు. రైల్వే డబ్లింగ్ పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని రైల్వే అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ, ఆర్అండ్బీ రహదారుల అంశాలతోపాటు పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.
బాధ్యతగా పనిచేయాలి
అధికారులు ప్రజలకు చేరువగా ఉండాలని ప్రభుత్వం అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఆర్డీవో కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న వినాయక కమ్యూనిటీ భవనం నిర్మాణాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల ఉపకార వేతనాలు, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయం స్కాలర్‌షిప్‌లతోపాటు పలు పథకాల అమలుతీరును పరిశీలించారు. డీఆర్డీవో కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసే, ఉపాధి హామీ పథకం ద్వారా సంఘాలకు బ్యాంకుల ద్వారా అందజేసే రుణాలు, కూలీల హాజరును కలెక్టర్ పరిశీలించారు. అధికారులు ఏ స్థాయిలో ఉన్నా వారి పరిధిలోని ప్రతి పనిని పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ డీడీ యాదయ్య, మైనార్టీ సంక్షేమాధికారి శంకరాచారి, సీపీవో దశరథం, డిప్యూటీ ఇంజినీర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
‘రూమ్ టు రీడ్ ఇండియా’ కృషి అభినందనీయం
బాలకల సంక్షేమంలో భాగంగా ఆరోగ్యం, విద్య, రక్షణ జీవన నైపుణ్యాలపై రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్టు కృషి అభినందనీయమని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రూమ్ టు రీడ్ ట్రస్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అరుణ్, సరిత కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ట్రస్టు 2008 నుంచి బాలికావిద్య అక్షరాస్యతకు పనిచేస్తుందని తెలిపారు. 2020 సెప్టెంబర్ నుంచి అన్ని కేజీబీవీలలో టీచర్లకు శిక్షణతోపాటు పలు అంశాలకు సంబంధించి ట్రస్టు సభ్యులు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలికావిద్య విషయంలో జిల్లా తరఫున సహకారం అందిస్తామన్నారు.