గద్వాల, ఆగస్టు 26 : చేనేత కార్మికులకు పొదు పు, సాంఘిక భద్రత క ల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత (త్రిఫ్ట్ఫండ్ సెక్యూరిటీ) పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నారు. ఇందుకుగానూ ప్ర భుత్వ ఆదేశాలు రావడంతో చేనేత జౌళి శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూత లభించనున్నది.
పథకం వర్తింపు..
చేనేత వృత్తిపై ఆధారపడి సహకార, సహకారేతర రంగాల్లో ఉన్న వారికి, కలర్ అద్దకం, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైన్డింగ్, సైజింగ్ చేసే చేనేత కార్మికులందరికీ ఈ పథకం వర్తించనున్నది. 18 ఏండ్లు నిండి కనీసం 50 శాతం చేనేత వృత్తి నుంచి ఆదాయం పొందేవారు అర్హులు.
లబ్ధి ఇలా..
చేనేత కార్మికులు చేనేత, జౌళిశాఖలో లభ్యమయ్యే ఫారం-1, కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఫారం-2లో పొందుపరిచిన వివరాలతోపాటు ఫొటో అతికించి సహాయ సంచాలకులు, జౌళిశాఖ జోగుళాంబ గద్వాల జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బీ ఖాతా ఉన్న బ్యాంకులో చేనేత కార్మికుడు, సహాయ సంచాలకులు, జౌళిశాఖ వారు ఉమ్మడిగా ఆర్డీ-1, ఆర్డీ-2 ఎస్బీ ఖాతాలను జాతీయ బ్యాంకులో తెరవాలి. ఆర్డీ-1, ఆర్డీ-2 ఖాతాల కాల పరిమితి మూడేండ్లు ఉంటుంది. ఆర్డీ నియమాల ప్రకారం వడ్డి అనుమతింపబడును. ఒకవేళ 8 శాతం వాటా మూడు నెలలు చెల్లించడంలో బకాయి పడితే బకాయిదారుడిగా భావిస్తారు. వారికి ఆర్డీ-1, ఆర్డీ-2 ఖాతాలో ఉన్న డబ్బును 36 నెలల కాలపరిమితి ముగిసిన తర్వాత తీసుకునేందుకు అనుమతిస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే నామినీ లేదా చట్టరీత్యా వారసులకు ఆర్డీ నియమాల ప్రకారం డబ్బులు తీసుకోవచ్చు. వీరితో పాటు చేనేత వృత్తిలో ఉండి జియోట్యాగింగ్ కలిగి ఉన్న చేనేత, అనుబంధ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డబ్బు జమ ఇలా..
ప్రతి చేనేత కార్మికుడు తన సంపాదన నుంచి ప్రతి నెలా 15వ తేదీలోగా 8 శాతం ఆర్డీ-1 ఖాతాలో జమచేయాలి. 8 శాతం జమ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే 16 శాతం వేతనాలను సంబంధిత ఆర్డీ-2 ఖాతాకు జమ చేస్తారు. చేనేత కార్మికుడు జమ చేసిన ఆర్డీ డబ్బులను 36 నెలలలోపు తీసుకునేందుకు అనుమతిలేదు. చేనేత కార్మికుడు, సహాయ సంచాలకులు, చేనేత జౌళిశాఖ వారు ఉమ్మడిగా ఆర్డీ-1, ఆర్డీ-2 ఎస్బీ ఖాతాలను జాతీయ బ్యాంకులోనే తెరవాలి.
నేతన్నకు చేయూత పథకానికి అర్హత ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో సమర్పించాలని జో గుళాంబ గద్వాల జిల్లా సహాయ సంచాలకులు, చేనేత జౌళిశాఖ అధికారి గోవిందయ్య కోరారు. గురువారం ఒక్క రోజే జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 951 దరఖాస్తులు వచ్చాయన్నారు.