నాగర్‌కర్నూల్, ఆగస్టు 8, నమస్తే తెలంగాణ: వ్యవసాయ రంగానికి మరింత ఊతం అందనున్నది. జిల్లా అభివృద్ధికి ఖరారు చేసిన రుణ ప్రణాళికను అధికార యంత్రాంగం వ్యవసాయానికి అగ్ర తాంబూలం ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంతోపాటు చిన్న తరహా, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు ఆర్థికంగా చేయూతనందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఇలా జిల్లాలో రూ.4,226కోట్లతో వందశాతం చేరుకునేలా అధికారులు రుణ ప్రణాళికను విడుదల చేశారు.
వ్యవసాయానికే ప్రాధాన్యత
నాగర్‌కర్నూల్ జిల్లాలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా రుణ ప్రణాళిక ఖరారైంది. 2021-22ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాలతోపాటుగా విద్య, గృహ నిర్మాణం, మైక్రో ఎంటర్ప్రైజెస్లాంటి ప్రాధాన్యత రంగాల కేటగిరీల్లో రుణాలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ శర్మన్‌చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో రూ.4,226కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించడం గమనార్హం. దీనికిగానూ జిల్లాలోని 15బ్యాంకుల పరిధిలోని 77బ్రాంచ్‌లకు రుణాలు అందించే లక్ష్యాన్ని నిర్ధేశించారు. ప్రతి బ్యాంకు వందశాతం రుణ లక్ష్యాన్ని సాధించేలా కలెక్టర్ ఆదేశించారు. కాగా ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత లభించింది. జిల్లాలో వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి కనిపిస్తున్నది. ప్రస్తుత సీజన్లో 6లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సమాయాత్తమవుతున్నారు. దీంతో జిల్లా రుణ ప్రణాళికలోని రూ.4,226కోట్లలో వ్యవసాయానికి 89.29శాతంతో రూ.3,773.83కోట్లు కేటాయించారు. ఇందులో రైతులకు స్వల్పకాలిక పంట రుణాలతోపాటుగా యాంత్రీకరణకు ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను అందించడం, భూమి చదును చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోదాంల నిర్మాణం, రైస్ మిల్లులకు కూడా రుణాలు అందించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, ఉద్యానవన, మత్స్యరంగాలకూ ప్రాధాన్యత కల్పించారు.
ఇలా వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగాల్లో కూడా 6,127మందికి 5.11శాతంతో రూ.215కోట్లను అందించేలా ప్రణాళిక ఖరారైంది. అదేవిధంగా విద్యకు రూ.9.56కోట్లు (0.23శాతం), ఇంటి రుణాలకు రూ.65.03కోట్లు (1.54శాతం), సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.4.16కోట్లు (0.10శాతం), సోలార్ ఎనర్జీ ఉత్పాదనకు రూ.7.68కోట్ల (0.18శాతం)తో రుణాల ఖరారు పూర్తయింది. ఇలా రూ4,226కోట్లలో ప్రాధాన్యత రంగాల్లోని 2,13,628మందికి గానూ రూ.4,076.18 కోట్లను అందించనున్నారు. అదేవిధంగా అప్రాధాన్యత రంగాల్లోని 2,531మందికి రూ.150కోట్లు అందిస్తూ జిల్లాలో మొత్తం 2,16,159మందికి గానూ రూ.4,226.18కోట్లను వందశాతంతో అందించడమే లక్ష్యంగా అధికారులు రుణ ప్రణాళిక ఖరారు చేయడం విశేషం. ప్రభుత్వం ఆశించినట్లుగా అర్హులందరికీ రుణాలు అందించేలా కార్యాచరణ తయారు చేశారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో పత్తి, వేరుశనగ, వరి తదితర పంటలు అత్యధికంగా ఉత్పత్తి అవుతుండడంతో గోదాంలు, కోల్డ్‌స్టోరేజీలు, ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సహకరించేలా రుణ ప్రణాళిక తయారు చేయడం గమనార్హం. దీనికిగాను మండలస్థాయిలో అవగాహన సదస్సుల నిర్వహణకు బ్యాంకర్లు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమాయాత్తమవుతున్నారు. ఇక గతేడాది జిల్లాలో వ్యవసాయానికి రూ57.83శాతం రుణాలు, 8648 స్వయం సహాయక సంఘాలకు రూ.257కోట్ల రుణాలు అందించారు. ఈ ఆర్థిక సంవత్సరం వందశాతం రుణాలు అందించేలా అధికార యంత్రాంగం నిర్ణయించింది.
వందశాతం లక్ష్యం అధిగమిస్తాం
జిల్లాలో రూ.4,226కోట్లతో రుణప్రణాళికను ఖరారు చేశాం. గతేడాది కొవిడ్ ఉన్నా వ్యవసాయానికి 58శాతం రుణాలు అందాయి. ఈసారి వ్యవసాయంతోపాటు వ్యాపారులు, నిరుద్యోగులకు, ఇతర రంగాలకు వందశాతం రుణాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని 15బ్యాంకులు, 77బ్రాంచ్‌లకు ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్ధేశించాం. నిర్ధేశించిన లక్ష్యం అమలులో బ్యాంకర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణప్రణాళిక అమలు చేసేలా పర్యవేక్షిస్తాం.