జడ్చర్ల/నవాబ్‌పేట/రాజాపూర్/బాలానగర్, జూలై 21: మూడురోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఏడు ఇండ్లు కూలిపోయాయి. నియోజకవర్గంలోని నవాబ్‌పేట, బాలానగర్, రాజాపూర్ జడ్చర్ల మండలంలో కురిసిన వర్షానికి ఎగువనుంచి వర్షపునీరు వస్తుండటంతో దుందుభీ వాగు ఉధృతంగా పారుతున్నది. వాగు జడ్చర్ల మండలంలోని కోడ్గల్ వద్ద రోడ్డుకు ఆనుకుని నిండుగా పారుతోంది. దాంతో నీళ్లు ముందుకెళ్తుండడంతో లింగంపేట వద్ద దుందుభీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. అక్కడి నుంచి నెక్కొండ వద్ద చెక్‌డ్యాంలోకి వచ్చి చేరుతున్నది. శనివారం ఉదయానికల్లా అల్వాన్‌పల్లి వద్ద పర్శవేదీశ్వరస్వామి ఆలయం వద్ద చెక్‌డ్యాంలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. వాగు పారుతుండటంతో పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాగు నిండుగా పారుతుండటంతో బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా వాగు పరీవాహక ప్రాంతంలో రైతులు వరిని అధికంగా సాగు చేయనున్నారు. రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని కరిగెట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలంలో 4 ఇండ్లు, బాలానగర్‌లో 1, రాజాపూర్‌లో 1, జడ్చర్లలో 1 ఇల్లు కూలిపోయింది. జడ్చర్ల మండలంలో 15.5మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్ మండలంలో కుంటల్లోకి కొద్దిపాటి నీరు వచ్చి చేరింది. మండలంలో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.
వర్షంధాటికి కూలిన పాత ఇండ్లు
నవాబ్‌పేట మండలంలో శుక్రవారం ఉదయం వరకు 11.64శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి మండంటలోని వివిధ గ్రామాల్లో నాలుగు ఇండ్లు కూలిపోగా, కుటుంబ సభ్యులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. కూలిన ఇండ్లను, వివిధ గ్రామాల్లోని చెరువులను తాసీల్దార్ రాజేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇండ్లు కూలిపోయి నిర్వాసితులుగా మారిన వారి వివరాలను సంబంధిత అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే ఎన్మన్గండ్ల పెద్దచెరువు అలుగుకు గండి పడగా.. రైతులు పూడ్చారు. ఐబీ, రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందనలేదని రైతులు వాపోయారు. రుక్కంపల్లి ఎర్రకుంట, లింగంపల్లిలోని కొత్తకుంట, లింగంకుంట, ఆర్సీపూర్లో పటేల్‌కుంట, రుద్రారంలో ఊరంచుకుంటలు నిండి మద్దడి దూకాయి.
91.08 మి.మీ వర్షపాతం
రాజాపూర్ మండలంలో 91.08 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజాపూర్ మైసమ్మ కుంట, తిర్మలాపూర్ ఊరకుంట, ఎర్రకుంట అలుగుపారాయి. ఈద్గాన్పల్లికి చెందిన బైండ్ల ఇస్తారి, రంగారెడ్డిగూడ కాటేపాగ వాణి, తిర్మలాపూర్ గుడ్ల యాదయ్య ఇండ్లు కూలిపోయాయి. రాజాపూర్ రైల్వే అండర్ బ్రిడ్జిలోకి వర్షం నీరు చేరి మండల కేంద్రం నుంచి మల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, యారన్పల్లి, సోమ్లాతండా, నన్చెరువుతండాలకు రాపోకలు నిలిచిపోయాయి.
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
బాలానగర్ మండలకేంద్రంతోపాటు పెద్దరేవల్లి, గౌతాపూర్, మోతిఘణపూర్, పెద్దాయపల్లి, గుండేడ్, సురారం, నేరళ్లపల్లి, ఉడిత్యాల, కేతిరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో చెరువులు, వాగులు, కుంటల్లో భారీ వరద వచ్చి చేరుకుంది. గౌతాపూర్‌లో చిలాల్ సాబ్ చెరువు, నేరళ్లపల్లిలో కుంటచెరువు, మోతీఘణపూర్లో వాగు అలుగు పారుతుంది. పెద్దరేవల్లిలో పీర్ల, అలోన్ చెరువు నిండింది. సురారం, మోతీఘణపూర్ చెరువులను తాసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. శేరిగూడలోని గొల్ల మల్లేశ్ ఇంటి కప్పు కూలిపోయింది. సుమారు రూ.40 వేల నష్టం జరిగిందని సర్పంచ్ శంకర్ తెలిపారు. అంతకుముందు సురారం బ్రిడ్జిని తాసీల్దార్ పరిశీలించారు. శుక్రవారం 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అలుగుపారుతున్న భవానీసాగర్
కోయిలకొండ, జూలై 21: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కోయిలకొండ మండలంలో జలకల సంతరించుకొంది. మండలంలోని అంకిళ్ల పెద్దవాగుతోపాటు మోదీపూర్ కత్వ, జై భవానీసాగర్ అలుగులు పారుతున్నా యి. ఆయా ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చిన్నలింగాల్చేడ్, మోదీపూర్వాగులో నిర్మించిన చెక్‌డ్యామ్ అలుగులు పారుతూ వాగునీరు కోయిల్‌సాగర్‌లోకి చేరుతున్నది. తాండూరు పరిసరాల్లో భారీ వర్షాలు కురువడంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలోని భవానీసాగర్ అలుగు పారుతూ దమ్మాయపల్లి చెరువులోకి భారీగా నీరు చేరుతున్నది. పెద్దవాగులో యువకులు చేపలు పట్టేందుకు తరలివచ్చారు.
అధిక వర్షంతో కూలిన ఇండ్లు
మహ్మదాబాద్, జూలై 21: ఇటీవల కురుస్తున్న అధిక వర్షాలకు మండలంలోని మంగంపేట్లో మూడు ఇండ్లు, మంగంపేట్తండాలో నాలుగు ఇండ్లు కూలిపోయాయి. దీంతో శుక్రవారం తాసీల్దారు ఆంజనేయులు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాతపాడుబడిన ఇండ్లలో ఉండరాదని సూ చించారు. అలాగే మల్కచెరువు తూము వెనుకాల సొరం గం మాదిరిగా రంధ్రం ఏర్పడింది. ఐబీ, రెవెన్యూ అధికారులు రంధ్రాన్ని పరిశీలించి మట్టితో పూడ్చి వేయించారు.
సాలార్‌నగర్ ప్రాజెక్టుకు జలకళ
గండీడ్, జూలై 21: మండలంలోని అతిపెద్ద సాగునీటి వనరు కలిగిన సాలార్ నగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పారింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద 19 వందల ఎకరాలు సాగు ఉండడంతో రైతులకు ఈ ఏడాది సాగు నీటితోపాటు బోర్లలో నీటిమట్టం పెరుతుందని సంబురపడుతున్నారు. మత్స్యకారులకు సైతం మత్స్య సంపదను పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 0.5 టీఎంసీలు ఉన్నట్లు స్థానిక గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.