
గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 10: గ్రామాల్లో పిల్లలకు నిమోనియా రాకుండా పీసీవీ వ్యాక్సిన్ వేయించాలని, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని రెండు మండలాల వైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ శ్వేత మంగళవారం ఏపీఎం, సీసీ, వీవోఏలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలస్థాయి, 11, 12 తేదీల్లో గ్రామస్థాయిలో పిల్లలకు నిమోనియా రాకుండా అవగాహన కల్పించాలని కోరారు. సీసీలు, వీవోఏలు, గ్రామ సంఘం సభ్యులు కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమాల్లో ఏపీఎం బాలకృష్ణ, సీసీలు, వీవోఏలు, గ్రామసంఘం సభ్యులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
నిమోనియాపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహిళా స్వశక్తిభవన్లో వైద్యాధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రగతి, ఇసిన్ముస్తాక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
పిల్లల్లో రోగ నిరోధకశక్తిని పెంచేందుకు నిమోనియా టీకాలు వేయించాలని డాక్టర్ ప్రతాప్చౌహాన్ పేర్కొన్నారు. మంగళవారం రాఘవపూర్‌లో వ్యాక్సిన్‌పై మహిళా సమాఖ్య సిబ్బందికి, సీసీలకు, వీవోఏలకు అవగాహన కల్పించారు. ఈ నెల 12నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం ద్వారా తొమ్మిది నెలలలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ సూపర్వైజర్ ప్రకాశ్, ఏపీఎం వెంకటాచారి, వీవోఏలు, ఆశకార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
ఏడాదిలోపు చిన్నారులకు ప్రభుత్వ దవాఖానల్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్‌ను విధిగా ఇప్పించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఐకేపీ భవనంలో మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పిల్లలకు దగ్గు, దమ్ము, ఆస్తమాలాంటి శ్వాసకోశ వ్యాధులను చిన్నతనంలోనే నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఇప్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రామయ్య, సూపర్వైజర్ రమేశ్, ఏపీఎం హైమావతి, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
చిన్నారులకు పీసీవీ వాక్సిన్ వేయించాలని డీఆర్డీవో పీడీ యాదయ్య సూచించారు. అడ్డాకుల పీహెచ్సీలోలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు వ్యాక్సిన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాధిక, ఏపీఎం సుదీర్‌కుమార్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.