గద్వాలన్యూటౌన్, సెప్టెంబర్ 11: జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో వీటిపై నిషేధం లేకపోవడంతో గుట్టుగా తీసుకొచ్చి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఒక్కో ప్యాకెట్ రూ.2 కొనుగోలు చేసి ఇక్కడ రూ.10నుంచి 20వరకు విక్రయిస్తున్నారు. ఇలా నెలకు రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం వీటి విక్రయాలను నిషేధించినా.. అక్రమార్కులు మాత్రం లెక్కచేయడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా గుట్కా ప్యాకెట్లను జిల్లాకు తీసుకొస్తున్నారు. నడిగడ్డ కేంద్రంగా కేటుగాళ్లతో కలిసి ఏపీ, తెలంగాణకు చెందిన అక్రమార్కులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గుట్కాకు అలవాటుపడిన వ్యక్తులు ఎన్ని డబ్బులైనా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు రెండు, మూడింతల లాభానికి విక్రయిస్తున్నారు. పోలీసులు జిల్లా సరిహద్దుతో పాటు జిల్లాలో సైతం దాడులు చేసి గుట్కాలు పట్టుకుంటున్నారు. వీటిని రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కానీ అధిక లాభాలకు అలవాటు పడిన అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లాలో గుట్కా, కైనీ అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు, టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు తరుచూ దాడులు నిర్వహిస్తున్నా ఈ దందాకు అడ్డుకట్టపడటం లేదు. గుట్కా విక్రయాలకు కర్ణాటక కేంద్ర బిందువుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులే సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారు. అలంపూర్ చౌరస్తా, నుంచి శాంతినగర్, అయిజ, బల్గెర మీదుగా రాయిచూర్‌కు చేరుకుంటారు. అక్కడ సరుకు కొనుగోలు చేసి గుట్టుగా కార్లు, ఆటోలు, బైక్‌లపై తరలిస్తుంటారు. కాగా బల్గెర, నందిన్నె అలంపూర్, పంచలింగాల చెక్‌పోస్టుల వద్ద పూర్తిస్థాయిలో తనిఖీ లేకపోవడంతో జిల్లామీదుగా ఇతర రాష్ర్టాలకు తరలింపు సాగుతున్నది.
పట్టుబడిన సంఘటనలు
ప్రత్యేక నిఘా పెడుతాం
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడుతాం. గుట్కా, కైనీ తదితర నిషేధిత పదార్థాలపై పక్క రాష్ట్రం కర్ణాటకలో బ్యాన్ లేకపోవడంతో ఇక్కడికి రవాణా చేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తాం. నిషేధిత గుట్కాలను విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. గుట్కా రవాణాను అరికడతాం.