
కోయిలకొండ, ఆగస్టు 8: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామకొండకు ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలొచ్చారు. శనివారం రాత్రి నుంచే భక్తులు శ్రీరామకొండకు చేరుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచి దర్శనం చేసుకున్నారు. రెండు గంటలపాటు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకొన్నారు. భక్తులు కొనేరు నీరు, వనమూలికలను తమవెంట తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్‌గౌడ్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తండ్రి రాజేశ్వర్‌రెడ్డి స్మారకార్థం పులిహోర, తాగునీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, రైతుబంధు కన్వీనర్ మల్లయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మార్మోగిన గోవిందనామస్మరణ
చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని సప్తగిరుల మధ్యన కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తిస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు బారులుదీరారు. అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పెద్దఎత్తున తరలొచ్చారు. కొంతమంది భక్తులు మెట్టుమెట్టుకు కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టారు. మరికొందరు గండదీపాలతో కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.