హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ) : పురపోరులో ‘హస్తం’ చతికిలపడింది. రెండేండ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ పట్టణ ఓటర్లను ఆకర్షించలేక కనీసం 40శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతటా ప్రచారం చేసినా, మంత్రులందరూ ఎక్కడికక్కడ మోహరించినా 39.80శాతం కూడా దాటకపోవడం అధికార పార్టీ తిరోగమనాన్ని సూచిస్తున్నది. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడినా, ప్రచారానికి అడ్డంకులను సృష్టించినా, కేసులతో కట్టడి చేసినా, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పారించి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఓట్లు రాబట్టలేకపోయింది. ఇక బీజేపీ సైతం 35శాతం నుంచి 15శాతానికి తగ్గి ఆ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది. అదేసమయంలో ప్రజాదరణతో బీఆర్ఎస్ సత్తాచాటింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించి మొత్తం ఓట్లలో 28.75% దక్కించుకున్నది. రెండేండ్ల్లలోనే రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు పుర ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరు గ్యారంటీలతోపాటు, 420 హామీలను ఇచ్చి బురిడీ కొట్టించి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. 39.40శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యంత స్వల్పంగా ఓటు శాతాన్ని పెంచుకున్నది.
కేవలం పార్లమెంట్లో 40.10శాతం ఓట్లను దక్కించుకున్నది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గతం కంటే తక్కువ ఓట్లను మాత్రమే పొందింది. కేవలం 39.80శాతానికే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిపోయింది. ఇది హ స్తం పార్టీపై ప్రజావ్యతిరేకతకు అద్దం పడుతున్నది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ శాతం ఓట్లను కైవసం చేసుకోవడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ హామీలను అమలు చేయకపోవడం, రెండేండ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను చేపట్టకపోవడంపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యతిరేకత తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైంది.
కప్పిపుచ్చుకునేందుకు తంటాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంగుతిన్నది. ఫలితాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా తంటాలు పడింది. 39.80శాతం ఓట్లను మాత్రమే సాధిస్తే, 52శాతానికి పైగా వచ్చినట్టు అసత్య ప్రచారాలకు తెరలేపింది. అనుకూల మీడియాలో హస్తం పార్టీదే హవా అంటూ హోరెత్తించింది. అధికార పార్టీకే అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వత్తాసు పలికింది. ఫలితాలను, పార్టీల వారీగా సాధించిన ఫలితాలను ప్రకటించకుండా కాలయాపన చేసింది. శుక్రవారం రాత్రివరకే ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడించిన తర్వాత కూడా శనివారం సాయంత్రం వరకూ కూడా ఎన్నికల సంఘం పార్టీల వారీగా ఓటు షేర్‌ను ప్రకటించకపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రానికే అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరాల్సి డాటా చేరింది.
కానీ ఆ గణాంకాలను ఎన్నికల సంఘం వెల్లడించకుండా కాలయాపన చేసింది. అధికార పార్టీ ఒత్తిడితోనే వెల్లడించలేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీ తన అనుకూల మీడియాలో 52శాతం సాధించినట్టుగా ఊదరగొట్టడం గమనార్హం. ఓట్ షేర్ డాటా ఆలస్యంపై అధికారులను సంప్రదించినా పొంతలేని సమాధానాలు చెబుతూ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌పై నెపం మోపేందుకు యత్నించింది. తుదకు శనివారం సాయంత్రం వెల్లడించింది. దీంతో ఓట్ల శాతంతో హస్తం పార్టీ గుట్టు రట్టయింది.
జోరు పెంచిన బీఆర్ఎస్
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది. ప్రజాదరణను చూరగొన్నది. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలను ఎక్కడికక్కడ ఆధారాలతో బట్టబయలు చేస్తున్నది. మరోవైపు ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత తరపున నిలదీస్తూ వస్తున్నది. భరోసా కల్పిస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మెప్పు పొందుతున్నది. అందుకు తాజా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఓట్ల శాతమే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో 16.68శాతం ఓట్లను మాత్రమే సాధించినప్పటికీ, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 28.75శాతం ఓట్లను దక్కించుకున్నది. గతం కంటే 12శాతం ఓట్లను అధికంగా జమచేసుకున్నది. మొత్తంగా పోలైన ఓట్లలో 15,05,006 (39.80శాతం) ఓట్లను కాంగ్రెస్ సాధిస్తే, బీఆర్ఎస్ 10,87,347 (28.75%) ఓట్లను చేజిక్కించుకున్నది. రెండింటి మధ్య కేవలం 4,17,659 ఓట్ల వ్యత్యాసమే కావడం గమనార్హం. అదీగాక తాజా ఫలితాలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని మరోసారి తేల్చిచెప్పాయి.
బీజేపీ గ్రాఫ్ డౌన్
రాష్ట్రంలో బీజేపీ నేతల హడావుడి అంతా ఇంతా కాదు. కాషాయపార్టీ గ్రాఫ్ సైతం పడిపోయింది. తాజాగా ఫలితాలే అందుకు ఉదాహరణగా నిలిచాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35.19శాతం ఓట్లను సాధించి, ఎనిమిది ఎంపీ స్థానాలను గెలిచింది. అంతేదానిని చూసి తామే ప్రత్యామ్నాయం అంటూ ఇప్పటివరకు ప్రగల్భాలు పలికింది. మున్సిపల్ ఎన్నికలకు ముందుకు కూడా మొత్తం గెలుస్తాం అంటూ బీరాలు పలికింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు లేకున్నా, పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టుందని, ఓటు బ్యాంకు ఉందని కాషాయ నేతలూ గప్పాలు కొట్టారు. కానీ అదంతా వట్టిదేనని తాజా ఫలితాలు తేల్చిచెప్పాయి. అదీగాక బీజేపీ గతం కంటే మరింతగా చతికిలపడింది. మొత్తంగా పోలైన ఓట్లలో 5,92,823 ఓట్లను సాధించి కేవలం 15.67శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45చోట్ల బోణీ కూడా కొట్టలేదంటే బీజేపీ ఎంత బలహీనంగా ఉన్నదో తేటతెల్లమవుతున్నది.
వివిధ పార్టీల ఓట్ల శాతాలు

