నేటి తెలుగు కవిత్వాన్ని ఐదారు దశాబ్దాల కిందటి కవిత్వంతో పోల్చి చూస్తే, అందులో చెప్పుకోదగిన పరిణతి ఏర్పడిందన్నది వాస్తవమే. అయితే, దానికి కారణం చాలావరకు కాలానుగతమైనదే అని చెప్పాలి. సంప్రదాయ రచనారీతి నుంచి పక్కకు తొలగి, అభివ్యక్తి విధానంలో కొత్తదనం, ఔన్నత్యం సాధించడమన్నది ఇతర భారతీయ భాషల్లో ఎలా జరిగిందో తెలుగులో కూడా అలానే జరిగింది. అయినా ఇది సంతోషించదగిన విషయమే. కానీ, తెలుగు కవిత్వంలో వస్తువైవిధ్యం, శిల్పవైవిధ్యం పెరగాలి. ఈ రెండు వైవిధ్యాలు ఇప్పుడు లేవా? అని ప్రశ్నిస్తే ఎందుకు లేవు, ఉన్నాయి. కానీ, అవి ఒక పరిమితికి లోబడి వృత్తపరిధిని దాటలేకపోతున్నాయి, అన్నది సమాధానం.
ఇతర భాషల్లోని కవిత్వంలో చోటుచేసుకుంటున్న వస్తుశిల్పాల్లోని వైవిధ్యాన్ని పరిశీలిస్తే తప్ప ఈ సత్యాన్ని గ్రహించలేం. ఆంగ్లకవిత్వాన్ని, బెంగాలీ, అస్సామీ, ఒడియా, పంజాబీ, కన్నడం, త మిళం, మలయాళం లాంటి భారతీయ భాషల కవిత్వ ఆంగ్లానువాదాలనూ ఉన్నత స్థాయి పత్రికల్లో చదవడం ద్వారా ఈ ఉటంకింపు (statement) లోని సత్యాన్ని రూఢి చేసుకోవచ్చు. ఆ పత్రికల్లో తెలుగు కవితల ఆంగ్లానువాదాలు అత్యంత అరుదుగా అచ్చవుతాయి. కాబట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కవిత్వాన్ని చదవడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలన్న మాట. లేకపోతే ఆ భాషల కవిత్వంలోని కొత్త ధోరణులు (new trends) మనకు పరిచయం కావు. వాటిని చదివితే తప్ప, కవిత్వాన్ని ఇట్లా కూడా రాయొచ్చా అని విస్తుపోయే అవకాశం ఎక్కడినుంచి వస్తుంది!? ఏదైతే మన మస్తిష్కానికి తెలియదో, దాన్ని మన కళ్లు దర్శించలేవు (What your mind does not know, your eyes cannot see) అన్నాడొక మహానుభావుడు. కొత్త రీతులతో పరిచయం (exposure) మనం కూడా కొత్తపుంతలు తొక్కేలా చేసి, ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.
‘పద్ధతులను/ధోరణులను’ అనుసరిస్తూ రాసినంత మాత్రాన ఎవరి రచనలైనా కాపీ రచనలు అయిపోవు. తెలుగు కవిత్వపు స్థాయి ఇతర భాషల్లో కన్న తక్కువగా ఉన్నదని అనడం లేదు. వస్తువైవిధ్యం, శిల్ప వైవిధ్యం పెరగాలనేదే ఇక్కడ చెప్పదల్చుకున్న ముఖ్య ఉద్దేశం.
ఎప్పుడైతే సామాజికత, సామాజిక ప్రయోజనం, సామాజిక స్పృహ కవిత్వంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు అనే అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటామో, అప్పుడే మన కవిత్వంలో వస్తువులు సగానికి పైగా అదృశ్యమవుతాయి. అదేవిధంగా ప్రేమ, బాల్యం, అమ్మ, నాన్న, పుట్టిన ఊరు వీటి గురించే పదేపదే రాయడం వల్ల అవి అరిగిపోయిన వస్తువులుగా మారిపోతాయి.. మారిపోయాయి కూడా. సామాజికతను కలిగిన వస్తువులతో కవిత్వం రాయడం మంచిదే కానీ, తక్కినవి తప్పకుండా నిరసించదగినవి అని అనలేం కదా! కాబట్టి, అన్నిరకాల అంశాలనూ స్వీకరించగల దృక్పథాన్ని అలవర్చుకుంటే, కవిత్వంలో వస్తువైవిధ్యం పెరుగుతుంది. ఒకే వస్తువును తీసుకుని కవితలు రాయడమనేది సాధారణంగా జరగదు కానీ, ‘ఒకే రకానికి చెందిన’ వస్తువులను తీసుకుని రాయడం ఇప్పుడు తరచుగా జరుగుతున్నది. పర్సనల్ కవిత్వం, కంప్లయింట్ కవిత్వం, టెంప్లేట్ కవిత్వం పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. రాయడానికి ఈ ప్రపంచంలో కొన్ని వందల వస్తువులున్నా అవే అవే అంశాలను మళ్లీ మళ్లీ ఎంచుకోవడం సాధారణమైపోయింది. పాత అంశాలనే వస్తువులుగా స్వీకరించినా శైలిలో గాని, శిల్పంలో గాని ఏదైనా కొత్తదనాన్ని ప్రవేశపెడితే, అది కొంతవరకు నయం. అలా కానిపక్షంలో కొంతకాలం తర్వాత మన కవిత్వంలో మొనాటనీ (ఏకరూపత తాలూకు విసుగు) ఏర్పడుతుంది.
శిల్పంలో విశిష్టతను సాధించడం కష్టమైన పని. కానీ, శ్రేష్ఠమైన శిల్పం వల్లనే కవిత్వానికి గరిమ సిద్ధిస్తుంది. ఒక వ్యక్తిని కవిగా చేసేది శిల్పమే. శిల్పశ్రేష్ఠత ప్రతిభకు నిదర్శనం అన్నది వివాదరహితమైన విషయం. మంచి వస్తువును స్వీకరించేందుకు ప్రతిభ అవసరం లేదని కూడా చెప్పవచ్చు. మంచి వస్తువును ఎంచుకుని దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రతిభ ఉంటుంది కానీ, కేవలం వస్తువును ఎంపిక చేసుకోవడంలోనే ఉండదు. కవిత్వం కోసం మంచి వస్తువులను స్వీకరిస్తే అది కవిని ‘మంచి వ్యక్తి’గా, లేదా అభ్యుదయ వ్యక్తిగా నిలబెట్టే అవకాశముంది. శిల్పం చాలా ముఖ్యమైనదని చెప్పినంత మాత్రాన వస్తువును చిన్నచూపు చూసే అవసరం లేదు. వస్తువు, శిల్పం రెండూ బాగుండాలి. కానీ, మనం అనుకునేవే మంచి వస్తువులు కానవసరం లేదని గ్రహించాలి.
కళ, శిల్పం అనే మాటలు ఇవాళ తిట్టుపదాలైపోయి, వస్తువు, సామాజికతలు అధిక అభిమానాన్ని చూరగొంటున్నాయి. ఒకవేళ సామాజికత అవసరం అని చెప్పినా, అది ఒకే రకమైనదిగా ఎందుకుండాలి? బడుగు జీవుల మీద సహానుభూతితో రాయడం, సంపన్నులనూ దోపిడీదారులనూ విమర్శిస్తూ, నిరసిస్తూ రాయడం, లోకంలోని అన్యాయాలను అపసవ్యతలను చీల్చి చెండాడటం వీటిని మాత్రమే సామాజికతతో కూడిన రచనా విధానాలుగా పరిగణించాలా? సమాజంతో సంబంధం కలిగి ఉన్న మరెన్నో ఇతర విషయాలను కవితా వస్తువులుగా ఎన్నుకుంటే, సామాజికతను చొప్పించడంతో పాటు వైవిధ్యాన్ని చూపినవాళ్లమవుతాం. ఉదాహరణకు, ఏనుగు నరసింహారెడ్డి రాసిన ‘గాయపడ్డాకే’ అనే కవితను పరిశీలిద్దాం. అందులోని కొన్ని పంక్తులను ఇక్కడ ఇస్తున్నాను. చదవండి:
దారిలో నడుస్తుంటే ‘చక్కగా నడవరాదా’ అంటారొకరువాహనం మీద పోతుంటే డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావంటారొకరు ఏదైనా వస్తువు ధర అడుగుతుంటే నీకు బేరం చేయడం వచ్చా అని దెప్పిపొడుస్తుంది ఆవిడ
అన్ని చురకత్తుల్ని తప్పించుకోవాలనుకుంటాను చివరికి గాయపడ్డాకే ఇల్లు చేరుకుంటాను ఈ కవితలో సామాజికత లేదని చెప్పగలమా?
ఇటువంటి కవితలు మరెన్నో కూడా మన సాహిత్యంలో ఉంటాయి. దీన్ని కేవలం ఒక శాంపిల్‌గా చూపిస్తున్నాను. కవిత్వంలో సామాజికత లేనంత మాత్రాన కవిత్వ ఊహలోని విశిష్టతను, వినూత్నత్వాన్ని ఇష్టపడకూడదా? ఏ కొత్తదనమూ లేని, అరిగిపోయిన వస్తువులతో రాసిన కవిత్వాన్ని అభిమానిస్తాం కానీ, కల్పనలో వైవిధ్యాన్ని చూపించే కవితలను సామాజికత లేదనే నెపంతో తిరస్కరిస్తాం చిత్రంగా! కేవలం నవ్యత కారణంగానైనా అటువంటి కవిత్వాన్ని అభినందించవచ్చు. శంభు ఆర్ రాసిన ఆంగ్ల కవితకు తెలుగు అనువాదంలోని ఒక భాగాన్ని ఇస్తున్నాను. చదివి, వస్తువులోని variety ని ఆనందించండి.
ఫుట్ పాత్ మీదనుండి రోడ్డుమీదికి అడుగు వేస్తూ, పెద్ద వానచినుకులను సామూహిక ఆత్మహత్యల నుండి రక్షించేందుకు నా గొడుగును విప్పుతాను ఆభిజాత్యం అతిగా వున్న చినుకులు పైన మెరిసే లోహపు శలాక మొనమీద దూకి తమను తాము అంతమొందించుకుంటాయి మిగతావి టప్పుమని మెత్తని శబ్దం చేస్తూ నల్లని గుడ్డమీద పడుతై
సామాజికత అనే విషయాన్ని పక్కనపెట్టి చూస్తే, as (లాగా)ను వస్తువు చేసుకుని ఆంగ్ల కవితను రాశాడొకాయన! అదేవిధంగా మరి (Then?) అనేది ఒక ఆంగ్లకథకు శీర్షిక. నిజానికి ఈ రెండు ఆత్మాశ్రయ రచనలు కావు. సమాజపు పోకడలతో పరోక్షమైన సంబంధం కలిగి ఉన్నవే. Then అనే ప్రశ్నను ఇతివృత్తం చేసుకొని కథను అల్లడం ఎంత అపురూపమైన విషయం! ఈ కవిత, కథలు జాతీయ స్థాయిని కలిగిన ప్రసిద్ధ పత్రికల్లో వచ్చాయి. ఇట్లా అరుదైన చిన్న అంశాలను వస్తువులుగా, ఇతివృత్తాలుగా చేసుకుని వాటి చుట్టూ మంచి శిల్పాన్ని అల్లుతూ రచనలు చేయడం వస్తువైవిధ్యానికి, శిల్పవైవిధ్యానికి తోడ్పడుతుంది. అయితే, అలా రాయడం వల్ల సమాజానికి ఏం ప్రయోజనం చేకూరుతుంది, అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ. సమాజానికి పెద్దమొత్తంలో చేకూరకపోయినా సాహిత్యానికి చేకూరుతుంది కదా అంటే, అది వృథా అనేవాళ్లుంటారు మనలో చాలా మంది. అంటే ఒకే పద్ధతిలో డైరెక్ట్‌గా రాసినవే మంచివి అని అర్థం. ఇట్లాంటి వైఖరి వలన తెలుగు కవిత్వంలో వస్తుశిల్పాల వైవిధ్యం కొరవడుతున్నది.
ఒకే వస్తువును తీసుకుని కవితలు రాయడమనేది సాధారణంగా జరగదు కానీ, ‘ఒకే రకానికి చెందిన’ వస్తువులను తీసుకుని రాయడం ఇప్పుడు తరచుగా జరుగుతున్నది. పర్సనల్ కవిత్వం, కంప్లయింట్ కవిత్వం, టెంప్లేట్ కవిత్వం పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. రాయడానికి ఈ ప్రపంచంలో కొన్ని వందల వస్తువులున్నా అవే అవే అంశాలను మళ్లీ మళ్లీ ఎంచుకోవడం సాధారణమైపోయింది.
– ఎలనాగ