ఊరిడిచి పోవడమంటే
కాళ్ళకు చెప్పులేసుకున్నట్టో
తాళం కప్పలేసుకున్నట్టో కాదు.
పాలింకిపోయిన బాలింత తిరంగ
నీళ్ళింకిపోయిన బావుల మెరంగ
ఎరుకలేని ఎండమావి కోసం
ఎగిసిపడే గుండెబావిలో
దుఃఖపు రాళ్ళని నింపుకొని
ప్రేమ జలను పూడ్సుకున్నట్టే
ఒక్కో ముల్లెను బండికెక్కిస్తుంటే
ఒక్కో పల్లెను దాటిపోతుంటే
మన్ను కింది తాతల గుర్తులన్నీ
పన్ను కింది ఆకలి మేకులన్నీ
ఉండిపోతావా? ఊగిపోతావా?
వలసపోతావా? వదిలిపోతావని,
రెండూ వేధిస్తున్నాయి
మనసులో వాదిస్తున్నాయి.
రెక్కల పెట్టుబడికి
ధాన్యపు గింజలు దొరుకుతాయని
పట్నం తల్లి వెంట
బాతు పిల్లల్లా వెళుతున్నామే కానీ,
మనసునిక్కడే వదులుతున్నాము.
తెలుసా,
ఏ కష్టమొచ్చినా, ఎంత నష్టమొచ్చినా
బంతిపూవులోని రెక్కల్లా
ముద్దలోని మెతుకుల్లా
ఊరంతా ఒక్కటయ్యేవాళ్ళం
ఉప్పెనై కదిలేవాళ్ళం.
ఇప్పుడు.. కూలి కోసం
జ్ఞాపకాల చిత్రాలను
కన్నీటి కాలువలో ముంచి
దుఃఖపు ముడుపుని పొలిమేరకి కడుతుంటే
ఎండు కొబ్బరిలా గుండె పగిలిపోయింది
మండు వేసవిలా మనసు మాడిపోయింది.
– సందీప్ వొటారికారి 93902 80093