నగరంలోకి వచ్చినవాళ్లు అడ్రసులు
చూపించమని అడుగుతుంటారు
గూగుల్ కంటే కచ్చితమైన దిక్సూచిని నేను
ఊర్ల నుంచి వచ్చేవారి మట్టి చేతుల్లోని
చెరుకు పరిమళాన్ని తడమడానికి
నా మురికి పట్టిన చేతులతోనే వెళ్లుతా
వ్యవసాయం నడవని మనుషులు
విరిగిన నాగలి ముక్కలా ఇక్కడికొస్తారు
ఆల్ఫా ఇరానీ చాయిలో ఉస్మానియా బిస్కెట్లా కరిగిపోయి ఈ వాతావరణంలోకి ఒదిగిపోతారు
కొన్నిసార్లు బంధువులు లగేజీతో దిగుతారు
వాళ్లని ఉయ్యాలలో ఆడుకునే పసిపిల్లల్లా
జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదవుతుంది
అనాథల్లా ఏ సంచీ లేకుండా బస్సు దిగినవాళ్లకు వెంటనే ఆకలి తీర్చే బిర్యానీలా మారిపోతాను
మిత్రులు వస్తారు ఊరి నీడను వదిలిపెట్టి
పరీక్షలు రాయడానికి
ఉద్యోగం కళ్లముందు తలెత్తుకున్న
పొద్దు తిరుగుడు చేనులా కనబడుతుంది
సాయంత్రం జబ్బలు జారేసి
వాలిపోతుంది ప్రయత్నం
వాళ్లను ఉత్తేజపర్చడానికి హుస్సేన్‌సాగర్
బుద్ధుడి ముందే నిలబెట్టి నిమ్మళపరుస్తాను..
పనికోసం వచ్చేవాళ్లను రిసీవ్ చేసుకోవడం
గౌరవంగా భావిస్తాను
కల్లంల నుంచి నాలుగు గింజలను నోట్లో పట్టుకొచ్చి
ఏ మందిరం మీదనో, మినార్ మీదనో
వదిలిపెట్టే పిట్టల్లాంటి మనుషులు
ఇంద్రధనుస్సు రెండు చివర్లను పట్టుకొని
భూమిని రంగులమయంలో చేసినవాళ్లు
జీవితం మొత్తం ఆశకే అంకితం చేసినవాళ్ల
వెంట నీడలా అల్లుకుపోతాను
సుఖాలు బాధలు ఉదయం రాత్రులే ఇక్కడ
నిశ్చల కాలం మబ్బులనే
డబల్ రొట్టెలాంటి కాలం ఇక్కడికొచ్చే
మనుషులను రెప్ప కొట్టకుండా కాపలా కాస్తుంది
రెండు దోసిళ్లలో చెమట తడిని ఒంపి
పనిమంతుల్ని చేస్తుంది
తన ఆకలిని ఎన్నడూ చెప్పకుండా ఇక్కడికి
బతుకొచ్చే మనుషుల ఆకలితీరుస్తున్నా
నోరులేని అమ్మ కదా ఈ నగరం
– వేముగంటి మురళి 93922 56475