గింజ గింజకు ముక్కుబడి
అరువు రాశిలో కూరుకుపోతూ
గిట్టని పంట కింద నలిగిపోతూ
కన్నీళ్ళను తాగి దప్పిక తీర్చుకుంటాడు
బురద మట్టిలో అడుగులేస్తూ
విధి విదిలించిన గింజల్ని హత్తుకుని
అకాల వర్షానికి ప్రణమిల్లుతాడు
గూడు చెదిరిన జీవితానికి
అతుక్కుపోతూ కాలం గడుపుతాడు
పంపకాలకే పంటను ధారపోస్తూ
పిప్పికాయలతోనే మురిసిపోతూ
అదునుకు రాని చేను సెలకల్లో ఒదిగి
నాలుగు గింజల కోసం వెంపర్లాడుతాడు
కొండంత కూలి రేటుకు సొమ్మసిల్లుతూ
ఇసుమంత గిట్టుబాటుకు తలొంచుతూ
దళారీ వ్యవస్థలో సతమతమౌతాడు
మట్టిని నమ్మిన కౌలు రైతు
వెట్టి చాకిరీ చేతుల్లో చిక్కిపోతూ
చెమట చుక్కల సాక్షిగా
ఒట్టి చేతులతో సన్నగిల్లిపోతున్నాడు
నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు
కోలుకోలేని కౌలు రౌతు కరిగిపోతున్నాడు
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636