తెలుగు మన మాతృభాష. అయినా, ఇతర భాషలకు దక్కే గౌరవం మన మాతృభాషకు దక్కడం లేదని తెలంగాణ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడుతారు. కానీ, ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడినవారికే ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇది నా స్వీయ అనుభవం కూడా. తెలుగులో గ్రూప్-1 పరీక్ష రాసినవారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. తెలుగు మూల్యాంకనం చేసేవారి ప్రావీణ్యం, ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని టీజీపీఎస్సీని ఈ సందర్భంగా ఆదేశించారు.
భాష బోధనలో పిల్లలు సాహిత్య, సామాజిక, సాంఘిక, నైతిక విలువలు, చక్కటి సంభాషణా నైపుణ్యం, సమాచార లేఖనా నైపుణ్యం అలవడుతాయి. మాతృభాష బోధనలో అర్థవంతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, దేశభక్తి వంటివి అలవడుతాయి.
మాతృభాష నైపుణ్యం, ఇతర భాషల విధానం పట్ల ప్రజలు, ప్రభుత్వాల తీరుకు గ్రూప్-1 సంఘటన ఒక నిదర్శనం. భావ, జ్ఞాన ప్రసారానికి భాష వాహికగా ఉంటుంది. ఒక జాతి మనుగడ భాషపైనే ఉంటుంది. ప్రజల వ్యవహారంలో, విద్య ద్వారా భాష ప్రధానంగా కాపాడబడుతుంది. ప్రజల భాష ముఖ్యంగా వారి జీవన వ్యవహారంలో, సంస్కృతి, నాగరికత, వారి నిత్య కార్యకలాపాలు, విజ్ఞాన, సారస్వతం, కళల్లో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని వారసత్వంగా తర్వాతి తరానికి అందజేయబడుతుంది. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది విద్య. అలాంటి విద్యకు భాష జ్ఞాన వాహకంగానే పరిమితం కాదు, సృజనకు తోడ్పడే అతి ముఖ్యమైన సాధనం.
ప్రహ్లాదుడు ‘సారమెల్ల చదివితి తండ్రీ’ అన్నట్టుగా మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా జ్ఞాన సముపార్జనతో పాటుగా అర్థవంతమైన అభ్యసన సాధ్యమవుతుంది. ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు ప్రజల భాషకు తగిన గౌరవం లభించడం లేదు. భాష బహిరంగమైన విద్య ఒకప్పుడు రహస్యంగా దాచిపెట్టబడింది. ఆధునిక కాలంలో విద్య అందరికీ లభించే సమయానికి ప్రపంచ భాషలు మనుషుల మధ్య అనేక అంతరాలను సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత అర్ధ శతాబ్దంలో తీవ్ర మార్పులు వచ్చాయి. డెబ్బయ్యవ దశకం వరకు ఉర్దూ మాధ్యమంలో చదువు కొనసాగింది. తర్వాత తెలుగు మాధ్యమ పాఠశాలలు వచ్చాయి. 2012 తర్వాత ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ మోడల్ స్కూళ్లతో ప్రభుత్వం విద్యను పరిచయం చేసింది.
ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నాయి. అంటే, ఒక తరం చదివిన చదువు తర్వాతి తరానికి ఉపయోగపడటం లేదు. ఇది ప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. దీర్ఘకాలిక ప్రణాళిక కలిగిన విద్యాప్రణాళిక సమాజానికి శ్రేయస్కరంగా ఉంటుంది.
ఆంగ్ల మాధ్యమం లేదా ఇతర భాషలను నేర్చుకోవడమనేది ఐచ్ఛికంగా ఉన్నప్పటికీ.. విద్య, ఉపాధి, సామాజిక గౌరవం మూలంగా ప్రజలు మాతృభాషకు గౌరవం ఇవ్వడం లేదు. ఇది దీర్ఘకాలికంగా సమాజాన్ని గుణాత్మక దోషం వైపు నడిపించే అంశంగా పరిగణించాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం అంటారు.
తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు అధోగతికి చేరుతుందన్నది భాషావేత్తల ఆందోళన. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. ప్రథమ భాషగా 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయాలనుకున్నా వివిధ కారణాల వల్ల 10వ తరగతి వరకు మాత్రమే పరిమితం చేస్తూ పాలనాపర నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ విద్యలో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృత భాష ప్రవేశపెట్టడం గురించి భాషావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వారి ఆవేదన, ప్రజల ఆవేదన అర్థవంతమైనది. భావి సమాజానికి విద్య ఒక్కటే చాలదు. విలువలు, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, విలువలు గల సమాజ నిర్మాణానికి మాతృభాష అభ్యసనం తప్పనిసరి. ఇక్కడ సమాజం ఆలోచించాల్సింది ఉంది. ఎలాగూ విద్య మాధ్యమం ఆంగ్లభాషలోనే ఉన్నది. మాతృభాష ఒక విషయంగా కూడా చదవకపోతే వారు ఆత్మవిశ్వాసంతో ఎలా జీవించగలుగుతారు.
భావ వ్యక్తీకరణ ఎలా చేయగలుగుతారు. సమాజంలోని సంక్లిష్టతలను, జీవిత సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఆలోచించాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలు కౌమార దశలో ఉంటారు. వారికి మాతృభాష తెలుగు తప్పనిసరి. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ‘14,130’ మంది సంస్కృతం మాట్లాడుతున్నారు. భారతదేశంలో సంస్కృత భాష సాహిత్యపరంగా నిద్రాణమై ఉన్నది. ప్రజల వాడుక పరంగా మృత భాషగా ఉన్నది. మెకాలే మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ కీలక విద్యాపత్రంతో భారతదేశంలో ఆంగ్లేయ విద్యా విధానాన్ని అమలు చేయడంతో ఆంగ్ల విద్యా బోధనకు పునాది, సంస్కృత భాషకు సమాధి కట్టబడింది.
వలస పాలనలో పరిపాలనా భాషగా ఆంగ్లం ప్రోత్సహించబడింది. అప్పటివరకు భారతీయ విద్యాబోధనలో ఉన్న సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలు కనుమరుగయ్యాయి. తెలుగు భాషకకు సంస్కృత భాషతో సమానమైన ప్రాచీన హోదా గుర్తింపు, రాజ్యాంగ గుర్తింపు ఉన్నది. ఆధునిక, సాంకేతిక ఉపకరణాలన్నీ చక్కగా తెలుగును ధరించాయి. కృత్రిమమేధ సైతం తెలుగు భాషను చక్కగా అర్థం చేసుకుంటున్నది. మారగలిగే స్వభావవం ఉన్న భాష ఎప్పటికీ నిలబడగలుగుతుంది. సులువుగా వ్యాప్తిచెందుతుంది. ఆధాన ప్రధానాలతో తెలుగు భాష చక్కగా విస్తరించి, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ, బెంగాలీ తర్వాత 2వ స్థానంలో ఉన్నది.
తెలుగు రాష్ర్టాల్లో ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఇంటర్మీడియట్ బోర్డును 1971లో స్థాపించారు. విద్యార్థులకు ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, తమిళం, కన్నడ, ఒరియా, మరాఠి.. తృతీయ భాషగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలో తెలుగు ద్వితీయ భాషగా, ఆప్షనల్ భాషగా విద్యార్థులు ఎంపిక చేసుకోవడమేమిటని చాలాకాలంగా విద్యావేత్తలు, మాతృ భాషాభిమాన సంస్థలు, వ్యక్తులు ఆందోళనను వ్యక్తంచేస్తూనే ఉన్నారు. అయినా విద్యావిధానం, ఉపాధి అవకాశాలు, తల్లిదండ్రుల ఆశల పేరుతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు బోధించే అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. సంస్కృత భాషా బోధనకు అధ్యాపకులు లేరు. ఇంటర్మీడియట్ బోర్డు సంస్కృత భాషను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా తీసుకునే విద్యార్థుల సంఖ్య, అవసరమయ్యే సంస్కృత అధ్యాపకుల సంఖ్య కోసం విచారిస్తూ ఉత్తర్వులను జారీచేసింది.
విద్యలో శాస్త్రీయత ఉండాలి. కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం-2020లో కూడా మాతృభాషకే పట్టం గట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంగ్లాన్ని ప్రథమ భాషగా, ద్వితీయ భాషగా ఉన్న తెలుగు స్థానంలో సంస్కృత భాషకు చోటిస్తే తల్లి భాషను శాశ్వతంగా పిల్లల నుంచి వేరవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాషా బోధనలో పిల్లలు సాహిత్య, సామాజిక, సాంఘిక, నైతిక విలువలు, చక్కటి సంభాషణా నైపుణ్యం, సమాచార లేఖనా నైపుణ్యం అలవడుతాయి. మాతృభాష బోధనలో అర్థవంతమైన నైపుణ్యం, సృజనాత్మకత, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి వంటివి అలవడుతాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐచ్ఛిక భాషా విధానం తొలగించి తప్పనిసరి తెలుగును ప్రవేశపెట్టాలని భాషావేత్తలు కోరుతున్నారు. తెలుగును భాషగా మాత్రమే చూడకుండా విదేశాలలో మాదిరిగా సాహిత్యపరంగా ప్రోత్సహిస్తే సినిమా, కళా రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలుంటాయి. తెలుగును విద్య, ఉద్యోగ, నిత్య వ్యవహార లక్ష్యంగా ఉన్నతీకరిస్తే తెలుగు భాష దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుంది. అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడగలిగేదిగా మారుతుంది.
– శీలం భద్రయ్య 98858 38288