‘కంపతార సెట్లు// కొట్టి అమ్ముకొని
కడుపు నింపుకునే// కాలమొచ్చినది
సేతానం ఏడుందిరా// తెలంగాణ సేలన్నీ బీల్లాయెరా..’ అనే పాటను ప్రజా కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాశారు. తెలంగాణ రాష్ట్రం రాకమునుపు ఈ పాటను ప్రతీ నోట విన్నం. స్వరాష్ట్రం వచ్చినంక ఎక్కడా వినపడలే ఈ పాట. కానీ, తెలంగాణ ప్రజలు మళ్లీ ఈ పాట పాడుకునే రోజులొచ్చాయి.
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల// నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ ఉమ్మడి పాలనలో ఈ పాట ప్రజల్లోకి ఎంతమేర పోయిందో మనందరికెరుకే. కానీ, స్వరాష్ట్రం వచ్చినంక పల్లెలు పచ్చగా కళకళలాడినయి. ఇప్పుడు ఆ పల్లెలే మళ్లీ కన్నీరు పెడుతున్నయి. నా పల్లె తల్లి బందీ అయిపోయి యడాది నర్దమైతున్నది. ఎవరి చేతుల బందీ కాకుండా పల్లె కన్నీరు లేకుండా ఉన్న ‘రోజులు, దశాబ్ది కాలం’ నేడు బందీ అయిపోయింది.
‘అమ్మా తెలంగాణమా// ఆకలికేకలా గానమా// అమ్మ నీకు వందనాలమ్మా// కమ్మని ప్రేమ నీదమ్మా’.. ప్రజాకవి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్న రాసి, పాడిన ఈ పాటను ప్రతి ఒక్కరూ విన్నారు. ‘ఆకలికేకల గానాలున్నాయి, ఆపమని వందనాలు పెడుతున్న, మా మీద దయ చూప’మని కోరినందుకు ఉమ్మడి పాలకులు ఆయనపై కాల్పులు జరిపారు. కానీ, స్వరాష్ట్రం వచ్చినంక ఆ ఆకలికేకల గానాలు ఆగిపోయినయి.
‘పాలమూరులో కృష్ణమ్మ తల్లి// పాడుకున్నది ఆడుకున్నది// జూరాల వద్ద జూలలోగినది// శ్రీశైలం కొండలో శివతాండవం// సిందు లేసినది// కృష్ణమ్మ తల్లి తెలంగాణకు// కన్నీళ్లు తప్ప నీళ్లివ్వలేదు// గోదారమ్మ తెలంగాణను గోడ్రాలు చేసి పోయిందమ్మా..’ అంటూ తెలంగాణ సెలకలల్లో పంటకు గోదావరి నీళ్లివ్వలేదని, తెలంగాణలో పంటలు పండటం లేదని పాటల ద్వారా గద్దరన్న ధ్వజమెత్తారు. ‘కృష్ణమ్మ తల్లి తెలంగాణకు// కన్నీళ్లు తప్ప నీళ్లివ్వలేదు’ అంటూ కృష్ణా నది నీళ్లు గంటెడు కూడా తెలంగాణ పంటలకు పారుతలేవని ఆంధ్రా వలస పాలకుల పాలనను పాట రూపంలో నిరసించారు. తెలుగుగంగ పేరిట నాడు ఎన్టీ రామారావు తమిళనాడుకు నీళ్లిచ్చారే కానీ, తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని ఆంధ్రా పెత్తందారులను పాట ద్వారా ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వకపోగా.. రాజోలిబండ తూముల వద్ద పాలమూరుకు, కర్నూలుకు కత్తులు కట్టి కొట్లాట పెట్టిండ్రు. తెలంగాణ వచ్చేవరకు పాలమూరు పొలాలు పాడుబడ్డ బీల్లేనన్నది మనందరికీ ఎరుకే.
పాలమూరులో పంట పండని పొలాలను చూసి, వలస బతుకులను చూసి, కరువు నేల కాలాన్ని చూసి.. ‘నేనెట్లా బ్రతుకుదు కొడకా//కరువైన పాలమూరులోనా//కూలో నాలో చేసి కూడు గడుపుదమంటే//పని లేక పల్లెల్లో పాడుబడ్డ దాన్నైతి..’ అని నేను కూడా నా కలానికి పనిచెప్పాను. కొడుకును తలుసుకుంటూ, తన బతుకును గుర్తుచేసుకుంటూ దుఃఖంతో చేతగాని తల్లి పడే ఆవేదన ఈ పాటలో కనబడుతుంది.
‘చేతనైత లేదు ఓ కొడకా//ఇంట్ల శంభు నీళ్లు లేవు నా కొడకా// దూరంగా ఉన్న నీళ్లు తెచ్చుకోవడానికి నాకూ చేతనైత లేదు గొంతారి పోతుంది నేను సస్తనో బతుకుతనో రా కొడకా..’ అంటుంది వలసపోయిన కొడుకును తలుసుకుంటూ ఆ తల్లి.
1998/99 మధ్యలో రాసుకున్న పాటలు.
‘తెలంగాణ తెలంగాణ తెలంగాణమా// మా బాధలల్ల తెల్లారే రోజు ఏదమ్మా
తిననీకే తిండి లేక తాగనీకే కన్నీరు లేక//తిండి నీరు రెండు లేక తిప్పలెన్నో పడుతున్న,
బాధలతో తల్లాడిలే పల్లె చూడమ్మా//తల్లి తెలంగాణమా..’ తెలంగాణ ప్రజల బాధలు ఏ రోజు తీరుతాయోనని, ఆ రోజు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూసిన రోజులవి.
‘ఓ.. వానమ్మ ఆకాశం పైన ఆగవా//నీకోసం మేము చూస్తున్నాం// పైనుంచి పడవమ్మ ప్రాణాలు ఏమి పోవు గాని// పైరు కన్నా ప్రాణం పోయి వానమ్మ //మా ప్రాణాలన్నా నిలపరాదే వానమ్మ//చెరువు కుంటలెండిపాయే// బాయి గుంతలు బంగా మాయే// చినుకు లేక నేల చిన్నపాయే వానమ్మ // పశులు పక్షులు గొంతులెండి గోస పడుతున్నాయి వానమ్మ..’ అని నేను కూడా రాశాను.
గోరటి వెంకన్న నోటి వెంట జాలువారిన నీటి పాటలు ఎన్నో. ‘వాగు ఎండి పాయరో// పెద్దవాగు తాడి పేగు ఎండిపాయరో// గోదారి గోదారి ఓహో పారేటి గోదారి// చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి మా భూమి// తెలంగాణ భూమి..’ అని గోరటి వెంకన్న రాశారు.
‘తలాపున పారుతుంది గోదారి//
నీ సెను నీ సెలుక ఎడారి//
రైతన్న నీ బతుకు అమాస//
ఎండబెట్టి చూస్తుండ్రు తమాషా..’
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇలాంటి ఎన్నో పాటలను ప్రజాకవులు రాశారు.
‘వానమ్మ వానమ్మ వానమ్మ//
ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ//
చెరువుల నీళ్లు లేవు// సేలల్లో నీళ్లు లేవు
నిన్ను నమ్మిన రైతు// కళ్లల్లో నీళ్లు లేవు..’
అంటూ ప్రజాకవి, ప్రజా వాగ్గేయకారుడు జయరాజన్న రాశారు. ‘తెలంగాణలో రైతుల కండ్లల్లో నీళ్లు లేవు.. ఏడ్సి ఏడ్సి మనిషి ఒంట్లో కూడా నీళ్లు ఆరిపాయే. వానమ్మ ఒక్కసారి వచ్చిపోవమ్మా. తెలంగాణలో జీవనదులు ఎన్ని ఉన్నా చెరువులు ఎండిపోయి, జీవమున్న సెలకలు జీవం లేని సెలకలు అయినాయి’ అని వరుణ దేవుడిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇలా ఎందరో ప్రజా కవులు ఎన్నెన్నో పాటలు రాశారు. తెలంగాణ కరువుకు బాణీలు కట్టారు. కానీ, తెలంగాణ స్వప్నం సాకారమయ్యాక పదేండ్లలో కరువు పరార్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినిపించలె. మళ్లీ ఇప్పుడు ఆ పాటలను రాయాల్సిన, పాడుకోవాల్సిన గత్యంతరం పట్టడం తెలంగాణ చేసుకున్న దురదృష్టం.
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579